కొలువుదీరిన పంచాయతీ పాలకవర్గాలు
సుభాష్‌నగర్ : గ్రామ పంచాయతీల పాలకవర్గాలు కొలువుదీరాయి. సుమారు 21 నెలల తర్వాత గ్రా మాల్లో సర్పంచుల పాలన మొదలైంది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు సోమవారం జిల్లాలోని 544 గ్రామపంచాయతీల్లో పాలకవర్గాలు ప్రమాణస్వీకారం చేసి తొలి సమావేశాన్ని నిర్వహించాయి. ప్ర మాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాలకు ప్రభు త్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మ న్లు, పార్టీల జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు.
జిల్లాలో 545 గ్రామపంచాయతీలు, 5022 వార్డుస్థానాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల పాలకవర్గాలకు 2024, ఫిబ్రవరి 1 తో గడువు ముగిసింది. ఆ తర్వాత ప్రభుత్వం పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. సుమారు 21 నెలలపాటు గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు నిలిచిపోవడంతో గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. కేవలం కార్మికుల వేతనాలు మాత్రమే విడుదల చేసింది. పన్నుల వసూళ్ల ద్వారా వచ్చిన ఆదాయంతో ఇన్నాళ్లూ పాలన కొనసాగించారు. వివిధ పనులకు పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులు వెచ్చించారు.
పండుగలా..
గ్రామపంచాయతీల పాలకవర్గాల ప్రమాణ స్వీకా రం అట్టహాసంగా నిర్వహించారు. పదవీ బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో ముందస్తుగానే పంచాయతీ కార్యాలయాలను ముస్తాబు చేశారు. చాలా పంచాయతీలకు రంగులు వేయగా, మరికొన్ని కార్యాలయాలకు మామిడి తోరణాలు, షామియానాలు, టెంట్లు వేసి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, పైడి రాకేశ్ రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు కాటిపల్లి నగేశ్ రెడ్డి, దినేష్ పటేల్ కులాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, తదితర ముఖ్యులు కార్యక్రమాలకు హాజరయ్యారు.
సొంత గ్రామాల్లో నేతల గైర్హాజరు..
జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు సొంత గ్రామాల్లో జరిగిన ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమాలకు గైర్హాజరయ్యారు. ఒకరిద్దరు నేతలు మినహా మిగతా నేతలు స్వగ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయా గ్రామాల్లో ప్రత్యర్థి పార్టీలు బలపర్చిన అభ్యర్థులు గెలుపొందడమే గైర్హాజరుకు కారణమని రాజకీయవర్గాలు పేర్కొంటున్నారు. అమృతాపూర్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి, అంకాపూర్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పచ్చల నడుకుడ, సిరికొండ, నర్సాపూర్, కిసాన్‌నగర్‌లో అన్వేష్‌రెడ్డి, తాహెర్‌బిన్ హందాన్, మానాల మోహన్‌రెడ్డి, ఈరవత్రి అనిల్, ముదక్‌పల్లిలో నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తదితర నేతలు ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు హాజరుకాలేదు.
ఒక్కరు మినహా..
గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం మూడు విడతల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. 545 గ్రామపంచాయతీలకుగాను సోమవారం 544 గ్రామాల్లో పాలకవర్గాలు ప్రమాణస్వీకారం చేశాయి. సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డుసభ్యులతో ఆయా గ్రామాలకు నియమించిన అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు. సాలూర మండలంలోని కొప్పర్తిక్యాంపు సర్పంచ్ సతీశ్ తీర్థయాత్రలకు వెళ్లడంతో ప్రమాణస్వీకార కార్యక్రమం వాయిదాపడింది. ఉపసర్పంచ్, వార్డుసభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముగిసిన ప్రత్యేక అధికారుల పాలన
544 జీపీల్లో బాధ్యతలు స్వీకరణ
అట్టహాసంగా సర్పంచ్, ఉపసర్పంచ్‌ల ప్రమాణస్వీకారం
హాజరైన ప్రభుత్వ సలహాదారులు,
ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు


