ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించాలి
సుభాష్‌నగర్: నిజామాబాద్ నగరంలో ఫుట్‌పాత్ ఆక్రమనలను తొలగించి ట్రాఫిక్‌ను నియంత్రించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య, మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ తోపాటు ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే శనివారం సమీక్ష నిర్వహించారు. సీపీ, మున్సిపల్ కమిషనర్‌కు పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పెద్ద నగరాల్లో నిజామాబాద్ కార్పొరేషన్ ఒకటని, నగర అభివృద్ధి, సుందరీకరణకు అందరం సమష్టి కృషితో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. నగరంలో జనాభా పెరుగుతున్న క్రమంలో ప్రజలు నిత్యం ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు. ట్రాఫిక్ నియంత్రణలోభాగంగా ఫుట్‌పాత్ కబ్జాలు, సిగ్నల్ పాయింట్స్, వన్ వే రోడ్, పార్కింగ్ విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల సరఫరాపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. నగరంలో గ్యాంగ్ రెచ్చిపోతున్నారని, వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. అర్ధరాత్రి వరకు విచ్చలవిడిగా దుకాణాలు నడుపుతున్న వారిపై పోలీసులు కఠినచర్యలు తీసుకోవడంపై ఎమ్మెల్యే అభినందించారు. ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, బీజేపీ నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
నగర అభివృద్ధి, సుందరీకరణకు సమష్టిగా కృషి చేద్దాం
డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపండి
సమీక్షలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్


