ఎస్‌ఎస్‌ఆర్ కళాశాలకు అటానమస్
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎస్‌ఆర్ డిగ్రీ కళాశాలకు యూజీసీ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి హోదా లభించినట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ తెలిపారు. కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియాతో ఆయన మాట్లాడారు. 33 సంవత్సరాలుగా జిల్లాలో ఎస్‌ఎస్‌ఆర్ డిగ్రీ కళాశాల కొనసాగుతోందని, 2025–26 విద్యా సంవత్సరం నుంచి కళాశాలకు నూతనంగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ స్వయం ప్రతిపత్తి హోదాను కల్పించిందన్నారు. ఈ గుర్తింపుతో కళాశాల విద్యా ప్రాముఖ్యత, సృజనాత్మకత సమగ్ర విద్య అభివృద్ధి దిశగా ఓ మైలురాయి చేరుకున్నట్లు తెలిపారు. స్వయం ప్రతిపత్తితో కళాశాలకు సొంత పాఠ్య ప్రణాళిక రూపొందించుకోవడం, కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంతోపాటు ఆధునిక విద్య అవసరాలు, పరిశ్రమ అవసరాలను ప్రతిబింబించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని వివరించారు. స్వయంగా పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం చేసే అవకాశం ఉందన్నారు. స్వయం ప్రతిపత్తి హోదా లభించడంతో మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రత్యేక హోదాకు కృషి చేసిన కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో కళాశాల డైరెక్టర్ హరిత గౌడ్, హర్షిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


