బల్దియా జిరాక్సులకు రూ. లక్షలు
నిజామాబాద్ సిటీ: నగరపౌరులు చెల్లించాల్సిన పన్నులను ముక్కుపిండి వసూలు చేస్తున్న బల్దియా అధికారులు వాటిని ఖర్చుచేసే విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించడం లేదు. జిరాక్సులు, ప్రింటింగ్ పేరిట లక్షల రూపాయలు సరైన ధృవీకరణ లేకుండానే బిల్లుల రూపంలో చెల్లిస్తూ ఖజానాను ఖాళీ చేస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ రాష్ట్రంలోనే మూడో అతి పెద్దది. బల్దియాలోని రెవెన్యూ, శానిటేషన్, ఇంజినీరింగ్, పెన్షన్, మెప్మా విభాగాలకు పెద్ద సంఖ్యలో జిరాక్స్ కాపీలు, ప్రింటింగ్ అవసరమవుతాయి. అన్ని విభాగాల్లో అవసరానికి మించి ప్రింటింగ్ మిషన్లు ఉన్నా.. బయటి సెంటర్లనే ఆశ్రయించడం గమనార్హం.
పక్కన పడేశారు..
మున్సిపల్ కార్యాలయానికి గతంలో లక్షల రూపాయలు వెచ్చించి రెండు జిరాక్స్ మిషన్లు కొనుగోలు చేశారు. వాటిని కొద్దిరోజులు మాత్రమే వాడి పక్కన పడేశారు. లక్షల రూపాయల ప్రింటింగ్ మిషన్లు మూలన పడేశారు. మళ్లీ యథావిధిగా అదే జిరాక్స్ సెంటర్‌లో కాపీలు తీయిస్తున్నారు.
ప్రతి నెలా లక్షల్లో చెల్లింపులు..
జిరాక్సుల పేరిట కార్పొరేషన్ ప్రతి నెలా లక్షల రూపాయలు చెల్లిస్తోంది. కౌన్సిల్ సమావేశం పేరిట సుమారు రూ.3.5 లక్షల బిల్లులు చేశారు. గతంలో చేసిన జిరాక్స్ కాపీలకు రూ.3 లక్షల వరకు బిల్లులు చేశారు. పన్నులకు సంబంధించి డిమాండ్ నోటీసులు, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం తదితర వాటికి సంబంధించి ప్రింటింగ్, జిరాక్సులకు లక్షల రూపాయల బిల్లులు చేశారు. ఇలా బల్దియా ప్రతి నెలా రూ.2లక్షల నుంచి రూ.3 లక్షల వరకు చెల్లిస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ బిల్లులకు కళ్లెం వేయాలని నగరవాసులు కోరుతున్నారు.
బల్దియా కార్యాలయం
మూలనపడ్డ సొంత మిషన్లు
పదేళ్ల నుంచి ఒకే సెంటర్‌కు పనులు
బిల్లుల్లో కమీషన్లు..కిక్కిరుమనని సిబ్బంది
ఇకపై బల్దియాలోనే..
కొన్నేళ్లుగా జిరాక్స్, ప్రింటింగ్ పనులు బయట ఇస్తున్నట్లు తెలిసింది. ఇది సమంజసం కాదు. దీనికి వెంటనే పుల్‌స్టాప్ పెడుతున్నాం. రెండు జిరాక్స్ మిషన్లు అందుబాటులో ఉంచుతున్నాం. ఇకపై జిరాక్స్, ప్రింటింగ్ కోసం కోసం ఒక్క పేపర్ కూడా బయటకు వెళ్లదు.
– దిలీప్‌కుమార్, మున్సిపల్ కమిషనర్
మొత్తం అక్కడే..
బల్దియా కార్యాలయానికి కొద్ది దూరంలో ఓ ప్రఖ్యాత జిరాక్స్ సెంటర్ ఉంది. బల్దియాకు సంబంధించిన జిరాక్సులన్నీ అక్కడే చేయిస్తారు. 15ఏళ్లుగా ఇదే జిరాక్స్ సెంటర్లోనే బల్దియా పనులు చేయిస్తున్నారు. ఐడెంటీ కార్డులు సైతం అక్కడే ప్రింటింగ్ చేయించారు. కార్పొరేషన్‌కు చెందిన అటెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, సిస్టమ్ అడ్మినిస్టేటివ్‌లు ఈ సెంటర్‌లోకి నేరుగా వచ్చి ప్రింటింగ్, జిరాక్స్ తీయించుకుంటారు. వాటి వివరాలు ఓ పుస్తకంలో నమోదు చేస్తారు. ఇక్కడే అసలైన చిక్కు ఉంది. తీసుకున్న జిరాక్స్ కాపీల సంఖ్యకు, బుక్‌లో ఎంట్రీ చేసిన జిరాక్స్‌లకు పొంతన లేదు. ఈ వ్యవహారంలో బల్దియాలో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అందరి ప్రమేయం ఉంటుందనే ఆరోపణలున్నాయి. బిల్లులో తలాపిడికెడు కమీషన్లు వస్తుండడంతో ఎవ్వరూ కిమ్మనకుండా జిరాక్స్ బిల్లులు పాస్ అయ్యేలా దగ్గరుండి మరీ చేయిస్తున్నారు.
బల్దియా జిరాక్సులకు రూ. లక్షలు


