అద్దె అరకలకు డిమాండ్
నిజాంసాగర్(జుక్కల్): యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటల సాగుకు అద్దె అరకలకు డిమాండ్ పెరిగింది. ఒక్క రోజుకు రూ.3 వేల చొప్పున చెల్లిస్తూ ఆరు తడి పంటల సాగు పనులను రైతులు పూర్తి చేసుకుంటున్నారు. మహమ్మద్‌నగర్ మండలంలోని సింగితం, తెల్గాపూర్, శేర్‌ఖాన్‌పల్లి, శనివార్‌పేట గ్రామాల్లో ఆరుతడి పంటలు జోరుగా సాగు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో నాగలి, ఎడ్లు లేకపోవడంతో ఆరుతడి పంటల సాగుకు అద్దె అరకల కోసం రైతులు వెతుకులాడుతున్నారు. మద్నూర్, బిచ్కుంద, పెద్దకొడప్‌గల్ ప్రాంతాల్లో ఉన్న ఎడ్లను అద్దెకు తీసుకు వచ్చి ఆరుతడి పంటలు సాగు చేయడంలో రైతులు నిమగ్నం అవుతున్నారు. నాగటేడ్లకు రోజుకు రూ.3 వేల చొప్పున చెల్లిస్తున్నారు. అంతేకాకుండా నెలకు రూ.30 వేల నుంచి రూ.45 వేల వరకు ఎడ్లకు అద్దె ఇస్తూ పంటల సాగుపై రైతులు దృష్టి సారించారు. గ్రామాల్లో పశువుల సంతతి రోజురోజుకు కనుమరుగవడంతో రైతులకు వ్యవసాయం కష్టంగా మారింది.


