బంగారు ఆభరణాల కోసమే వృద్ధురాలి హత్య
● నిందితుడి పట్టివేత
● ఘటన జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పొల్కంపేట గ్రామానికి చెందిన నరేంద్రుల సులోచన హత్య కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. నిందితుడు పొల్కంపేట గ్రామానికి చెందిన ముద్రబోయిన కుమార్ బంగారు ఆభరణాల కోసమే ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. లింగంపేట పోలీస్ స్టేషన్‌లో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఇంట్లో వృద్ధురాలు సులోచన ఒంటరిగా ఉన్న విషయం గమనించిన కుమార్ ఇంటి వెనుక ఉన్న తలుపును పైకి లేపి ఇంట్లోకి చొరబడ్డాడు. వృద్ధురాలు ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు అపహరించి ఆమెను తీవ్రంగా గాయపర్చి హత్య చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు ఆదివారం ఉదయం తన ఇంట్లో దాచిన బంగారు ఆభరణాలను తీసుకెళ్లడానికి వచ్చిన క్రమంలో అతడిని పట్టుకొని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి పుస్తెలతాడు, కమ్మలు, ఉంగరం, బంగారు గాజులు (సుమారు నాలుగు తులాలు) స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడు గతంలో చిన్నచిన్న దొంగతనాలు చేసేవాడని తెలిపారు. పని చేయకుండా ఆవారాగా తిరిగేవాడన్నారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. లింగంపేట ఎస్సై దీపక్‌కుమార్, సీబ్బంది రమేశ్, సంపత్, జవ్వినాయక్, లీక్యానాయక్, మదన్‌లాల్‌లను జిల్లా ఎస్పీ రాజేశ్‌చంద్ర అభినందించినట్లు తెలిపారు.
బంగారు ఆభరణాల కోసమే వృద్ధురాలి హత్య
బంగారు ఆభరణాల కోసమే వృద్ధురాలి హత్య


