అశ్రునయనాలతో అంత్యక్రియలు
● పాల్వంచలో గ్రేహౌండ్స్ జవాన్‌కు
అంతిమ వీడ్కోలు
● నివాళులర్పించిన మంత్రి పొన్నం, షబ్బీర్, మదన్‌మోహన్
● అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
కామారెడ్డి క్రైం/మాచారెడ్డి : నక్సల్స్ అమర్చిన మందుపాతరకు బలైన గ్రేహౌండ్స్ జవాన్ వడ్ల శ్రీధర్ అంత్యక్రియలు శుక్రవారం పాల్వంచ మండల కేంద్రంలో అధికార లాంఛనాలతో జరిగాయి. పాల్వంచ గ్రామస్తులే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివచ్చి జవాన్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర ఆధ్వర్యంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి తదితరులు శ్రీధర్ మృతదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. మంత్రి పొన్నం బాధిత కుటుంబాన్ని ఓదార్చిన అనంతరం ఆయన మాట్లాడారు. పెళ్లయిన 8 నెలలకే శ్రీధర్ మృతి చెందడం బాధాకరం అన్నారు. బాధి త కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందన్నారు. మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.2.17 కో ట్లతో పాటు 300 గజాల స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని పేర్కొన్నారు.
శ్రీధర్ ఆత్మశాంతి కోసం పాల్వంచ గ్రామస్తులు శుక్రవారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన చిత్ర పటం వద్ద కొవ్వొత్తులు ఉంచి నివాళులర్పించారు.
అశ్రునయనాలతో అంత్యక్రియలు


