ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం
కమ్మర్‌పల్లి: సీఎం రేవంత్‌రెడ్డిపై బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి ఆరోపించారు. కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో గురువారం ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా దివాలా చేసి, మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రశాంత్‌రెడ్డి ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప, సలహాలు సూచనలు ఇచ్చింది లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, ఇతర అన్ని వ్యవస్థలను బీఆర్‌ఎస్ నిర్వీర్యం చేసిందన్నారు. దానిని కాంగ్రెస్ ప్రభుత్వం సరిచేస్తూ ముందుకు వెళ్తుందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అవుతున్నప్పుడు మంత్రులుగా ఉన్న హరీష్‌రావు, ప్రశాంత్‌రెడ్డి ఎందుకు బాధ్యత తీసుకోలేదని ప్రశ్నించారు. ఆయనకు ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం ఏ విషయంలో విఫలమైందో చెప్పాలనుకుంటే చర్చకు వేదిక నిర్ణయించి తెలుపాలన్నారు. అందుకు తాము సిద్దంగా ఉన్నామని మానాల సవాలు విసిరారు. ఎన్‌ఎస్‌యూఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, కమ్మర్‌పల్లి ఏఎంసీ చైర్మన్ పాలెం నర్సయ్య, వైస్‌చైర్మన్ భూచయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకెట రవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాప్రసాద్, కిసాన్‌సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్, మల్లయ్య, సుంకెట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


