కళ్లముందే మాయాజాలం | - | Sakshi
Sakshi News home page

కళ్లముందే మాయాజాలం

Mar 15 2025 1:56 AM | Updated on Mar 15 2025 1:54 AM

తూనికలు, కొలతలు, వస్తువుల నాణ్యతా ప్రమాణాలు, ఆహార కల్తీ తదితరాలకు సంబంధించి వినియోగదారుల హక్కుల పరిరక్షణకు అనేక చట్టాలు ఉన్నప్పటికీ ఫలితం ఉండడం లేదు. ప్రభుత్వాలు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో వ్యాపారులు, వస్తు తయారీదారులు యథేచ్ఛగా వినియోగదారులను మోసం చేస్తూనే ఉన్నారు. శనివారం అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినం నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ‘సాక్షి’ బృందం వివిధ వ్యాపార సముదాయాల వద్ద పరిశీలన చేసింది.

వినియోగదారులను తెలివిగా మోసం చేస్తున్న పలువురు వ్యాపారులు

తూనికలు, కొలతల్లో మోసాలు..

నాసిరకం వస్తువులు అంటగడుతున్న వైనం

ఔషధాలు, ఆహార పదార్థాలు, ఎలక్ట్రిక్‌ వస్తువుల అమ్మకాల్లో ఇదే పరిస్థితి

థియేటర్లలో తినుబండారాలకు

అనేక రెట్ల వసూళ్లు

నేడు అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినం

ఇందూరులో ‘సాక్షి’ పరిశీలన

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో గ్రామీణ వినియోగదారులు 67 శాతం ఉన్నారు. ఇక్కడ తూనికలు, కొలతల శాఖ 2011 లీగల్‌ మెట్రాలజీ రూల్స్‌ అమలు చేసే విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా ఉంటోంది. అసలు ఈ శాఖ పనిచేస్తున్న సంగతే ఎవరికీ తెలియని పరిస్థితి. ఇక అక్రమ నిర్మాణాల విషయంలో 1987 మున్సిపల్‌ కార్పొరేషన్‌ అపార్ట్‌మెంట్‌ చట్టం, 2012 భవన నిర్మాణ నిబంధనలు, 2019 వినియోగదారుల రక్షణ చట్టం అమలు కావడం లేదు. జిల్లా స్థాయిల్లో వినియోగదారుల కమిషన్లు వేయడం లేదు. దీంతో వినియోగదారులు మోసపోతూనే ఉన్నారు.

బంగారు తూకంలో..

బంగారు దుకాణాల్లో కొనుగోలుదార్లకు టీజీఎస్టీ, సీజీఎస్టీ బిల్లులు ఇవ్వడం లేదు. తూకంలో సరైన కొలతలు పాటించినప్పటికీ, బంగారం తూకం వేసే సమయంలో వ్యాపారులు తెలివిగా సీలింగ్‌ ఫ్యాన్‌ను ఎక్కువ స్పీడ్‌ పెట్టడం ద్వారా తూకంలో తేడాను గమనించడం జరిగింది. శుభకార్యాలకు ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేసేవారి వద్దకు తెలిసిన వ్యక్తులు వచ్చి మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ, బంగారు వ్యాపారుల నుంచి ఎల్‌సీడీ టీవీలు, ఏసీలు, ఇతర ఖరీదైన గృహోపకరణాలను బహుమతిగా పొందుతున్నారు. ఈ మేరకు ఒప్పందం చేసుకుంటున్నారు.

హోటళ్లలో నీళ్ల బాటిల్‌ నుంచి దోపిడీ మొదలు..

జిల్లా కేంద్రంలో సుమారు 200 వరకు చిన్న, పెద్ద హోటళ్లు ఉన్నాయి. చాలావాటిలో బిల్లులు ఇవ్వడం లేదు. బడా హోటల్స్‌లో జీఎస్టీ పేరిట పిండేస్తున్నారు. వందలో ఒకరిద్దరికి కచ్చితమైన బిల్లులు ఇస్తున్నారు. నీరు ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా, నీళ్ల బాటిళ్లకు జీఎస్టీతో ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వానికి మాత్రం జీఎస్టీ లెక్కలు చూపించని పరిస్థితి.

హద్దులేని సినిమా థియేటర్ల దోపిడీ..

నగరంలోని మల్టీప్లెక్స్‌లు, టాకీస్‌లలో పార్కింగ్‌ నుంచి నీళ్ల బాటిళ్లు, శీతల పానీయాలు, తినుబండారాలకు బయటితో పోలిస్తే అనేక రెట్లు ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. తినుబండారాల క్వాలిటీ, క్వాంటిటీ అంతా తీసికట్టే. ఈ దోపిడీపై అనేక మంది నిలదీసినప్పటికీ మార్పు రావడం లేదు.

చిన్నపిల్లల కోసం ఇంటి నుంచి తీసుకొచ్చిన పాలకు సైతం అనుమతించని పరిస్థితి.

ఆహార భద్రత కమిటీలు వేయాలి

హక్కుల పరిరక్షణకు వినియోగదారులు సంఘటితం కావాలి. బహిరంగ మార్కెట్‌లో ఉప్పు ప్యాకెట్లు, వంట నూనెల ప్యాకెట్లు నాసిరకం ప్లాస్టిక్‌తో తయారు చేసినవి ఉంటున్నాయి. ప్రతి వినియోగ వస్తువు 90 శాతం వరకు ప్లాస్టిక్‌ కవర్లతో ప్యాకింగ్‌ జరుగుతోంది. దీంతో ఆరోగ్యరీత్యా, పర్యావరణ పరంగా తీవ్ర నష్టాలకు కారణమవుతోంది. వస్తు వినియోగం నాణ్యతను ఽధ్రువీకరించే ‘బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌’, ఆహార పదార్థాల్లో ప్లాస్టిక్‌ను నియంత్రించే ఆహార కల్తీ నిరోధక శాఖ, స్థానిక స్వపరిపాలన సంస్థలు క్రియాశీలకంగా వ్యవహరించాలి. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆహార సలహా సంఘాలు, వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిటీలు, ఆహార భద్రత కమిటీల ఏర్పాటు జరగాలి. హక్కుల అమలుకు ప్రభుత్వ యంత్రాంగాలు చిత్తశుద్ధితో వ్యవహరించినపుడే సుస్థిరమైన జీవనశైలికి మార్గం వేసినట్లు. – సాంబరాజు చక్రపాణి, వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి

బిల్లులు ఇవ్వరు..

ఎలక్ట్రికల్‌ షాపులో ఏ వస్తు వు కొనుగోలు చేసినా బిల్లు లు ఇవ్వడం లేదు. ఎంఆర్‌ పీ రేట్లను బట్టి అమ్మకాలు చేస్తున్నారు. దీంతో గ్యారంటీ వస్తువులు చెడిపోయినప్పుడు ఇబ్బందులు పడ్డాల్సి వస్తుంది. అధికారులు దృష్టి సారించి వినియోగదారులకు న్యాయం చేయాలి. – బలేరావు వేణుగోపాల్‌, ముబారక్‌ నగర్‌

కళ్లముందే మాయాజాలం1
1/2

కళ్లముందే మాయాజాలం

కళ్లముందే మాయాజాలం2
2/2

కళ్లముందే మాయాజాలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement