మాట్లాడుతున్న ఎంపీపీ సారిక హనుమంతురెడ్డి
ధర్పల్లి: ప్రజల సమస్యలపై చర్చించుకోవడానికి అధికారులు రాకపోవడంతో ధర్పల్లి ఎంపీపీ సారిక హనుమంతురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన అధికారులుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గత సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు సైతం పరిష్కరించకపోవడంతో ప్రజాప్రతినిధులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు వివిధ శాఖలకు చెందిన అధికారులు సభలో ప్రగతి నివేదికను చదివి వినిపించారు. అలాగే ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ.. గతంలో ఎన్ని సార్లు చెప్పినా సర్వసభ్య సమావేశానికి అధికారులు హాజరు కాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ధర్పల్లిలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు కృషి చేసిన ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జెడ్పీటీసీ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వైస్ ఎంపీపీ కల్లెడ నవీన్, ఎంపీడీవో లక్ష్మణ్, డిప్యూటీ తహసిల్దార్ ప్రవీణ్, ఎంపీవో రాజేష్ సర్పంచులు ,ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.


