భైంసా మున్సిపల్ కొత్త కమిషనర్‌గా నరేశ్ వరుసగా గత కమిషనర్లకు చేదు అనుభవాలు కొత్త సారుకు సవాల్‌గా ఆధిపత్య పోరు
భైంసాటౌన్: జిల్లాలో అత్యంత కీలకమైన భైంసా మున్సిపాలిటీలో పాలన అస్తవ్యస్తంగా మారింది. వరుస వివాదాలతో గత కమిషనర్లు చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. తాజాగా, డీఈఈగా ఉంటూ ఇన్‌చార్జి కమిషనర్‌గా చేసిన సంతోష్‌కుమార్ ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో మున్సిపాలిటీలో ఇటు డీఈఈ పోస్టుతోపాటు అటు కమిషనర్ పోస్టు ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భైంసా మున్సిపల్ నూతన కమిషనర్‌గా కె.నరేశ్‌ను నియమించింది. సోమవారం ఆయన భైంసా మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అయితే, గత అనుభవాల దృష్ట్యా భైంసా మున్సిపల్‌లో కమిషనర్ కుర్చీ అంటేనే అధికారులు ‘వామ్మో’ అనే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొత్త కమిషనర్ నిలబడతారా.. గత అధికారుల మాదిరి తడబడతారా అన్న చర్చ జరుగుతోంది.
కుర్చీ అంటేనే గుబులు..!
భైంసా మున్సిపల్ కమిషనర్ కుర్చీ అంటేనే అధికారులు వెనకడుగువేసే పరిస్థితి నెలకొంది. గతంలో ఇక్కడ పనిచేసిన పలువురు కమిషనర్లు ఏసీబీకీ చిక్కడం, వివాదాల్లో ఇరుక్కోవడం, స్థానిక రాజకీయ ఒత్తిళ్ల మధ్య సతమతమవడం పరిపాటిగా మారింది. గతంలో కమిషనర్‌గా పనిచేసిన వెంకటేశ్వర్‌రావు ఓ భవన నిర్మాణం ఆస్తిపన్ను విషయంలో ఏసీబీకి చిక్కారు. ఆ తరువాత బాధ్యతలు చేపట్టిన రాజేశ్‌కుమార్ ఒక ఆస్తి మ్యుటేషన్ వివాదానికి సంబంధించి పోలీసు కేసు నమోదు కావడంతో బదిలీ అయ్యారు. తర్వాత గ్రూప్–2 ద్వారా కమిషనర్‌గా ఎంపికై న వై.నవీన్‌కుమార్ భైంసాలో నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడే మొదటి పోస్టింగ్ కావడం, సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న ఎంఐఎం ప్రతిపక్షంలోకి మారడంతో, కొత్తగా అధికారంలోకి వచ్చిన పాలకవర్గం, ప్రతిపక్ష ఎంఐఎం మధ్య తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక సమయంలో సైతం తీవ్ర గందరగోళం నడుమ ఆయన బదిలీ అయ్యారు. తర్వాత బాధ్యతలు చేపట్టిన మామిడిపెల్లి లింగయ్యపై సైతం నిధుల దుర్వినియోగం, విధులకు గైర్హాజరు వంటి ఆరోపణలతో సీడీఎంఏకు సరెండర్ అయ్యారు. తాజాగా డీఈఈగా ఉంటూ ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టిన జాదవ్ సంతోష్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో, భైంసాకు పోస్టింగ్ అంటేనే అధికారుల్లో ఒకరకమైన భయం నెలకొంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పూర్తిస్థాయి కమిషనర్‌గా నరేశ్ బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బాధ్యతల స్వీకరణ
భైంసా మున్సిపల్ నూతన కమిషనర్‌గా కె.నరేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ పాలనా విభాగం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సోమవారం భైంసా కార్యాలయానికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తూముల దత్తాత్రి, కౌన్సిలర్లు పలువురు కొత్త కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.


