బాసర: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం కార్తికమాసం తొలి సోమవారం భక్తులతో కిటకిటలాడింది. దీనికి తోడు అరుదైన ‘కోటి సోమవారం’ యోగం కూడా కలిసిరావడంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి నదిలో దీపాలు వదిలారు. కోటి సోమవారం రోజున చేసే స్నాన, దాన, అభిషేకాలు కోటి రెట్ల పుణ్యఫలం ఇస్తాయని భక్తుల విశ్వాసం. అనంతరం ఆలయ ప్రాంగణంలోని సురేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు శివలింగానికి జలాభిషేకం, క్షీరాభిషేకం, బిల్వపత్రాలతో ప్రత్యేక అర్చన చేశారు. తులసి కోట, ఉసిరి చెట్ల కింద మహిళలు కార్తిక దీపాలు వెలిగించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు చేయించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనాదేవి పర్యవేక్షణలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.


