నిర్మల్చైన్గేట్: జిల్లావ్యాప్తంగా ఈ నెల 19న ప్రా రంభించనున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ నమోదుకు ప్రత్యేక శిబిరాలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి సంబంధిత శాఖల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శిబిరాల ఏర్పాట్లు, నమోదు ప్రక్రియపై సమీక్ష చేశారు. అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఒకేరోజు ఈ నమోదు శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పథకంపై క్షేత్రస్థాయి అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, నామినీ, వయసు, బంధుత్వ వివరాలు తప్పులు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. డిజిటలైజేషన్ ప్రక్రియలోనూ పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.శిబిరాల నిర్వహణకు అవసరమైన కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ప్రింటర్లు ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రతీ కేంద్రంలో టెంట్లు, కుర్చీలు, తాగునీరు వంటి కనీస సదుపాయాలు కల్పించాలని తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులు విధిగా శిబిరాలకు హాజరై ప్రజలకు సహకరించాలని పేర్కొన్నారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి బీమా భరోసా కల్పించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. వీసీలో అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, సీపీవో గంగారెడ్డి, డీపీవో శ్రీనివాస్, పౌరసరఫరాల అధికారి రాజేందర్, ఉద్యానవన అధికారి రమణ, బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద్ పాల్గొన్నారు.


