నిర్మల్ రూరల్: రాష్ట్రంలో నూతన జాతీయ విద్యావిధానం 2020 పూర్తిస్థాయిలో అమలు చేయాలని తపస్ జిల్లా అధ్యక్షుడు శశిరాజ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం మాట్లాడారు. ప్రస్తుత 10+2 విద్యా విధానాన్ని 5+3+3+4 విధానంలోకి మార్చడం ద్వారా జాతీయ విద్యా విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసినట్లు కాదన్నారు. విద్యా వ్యవస్థను సమూలంగా సంస్కరించి విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యాలు, సృజనాత్మకత, శాసీ్త్రయ దృక్పథం, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలు పెంపొందించడమే ఈ విధానం ప్రధాన లక్ష్యమని తెలిపారు. దీనికోసం అన్ని అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా బాల్య దశ, విద్యకు ప్రాధాన్యత మాతృభాషలో బోధన, నాణ్యమైన విద్య, వృత్తి విద్య, ఉపాధ్యాయ శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కొత్త విధానంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనందున ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ, మౌలిక సదుపాయాలు, బోధనా వనరులు కల్పించాలన్నారు. నూతన విద్యా విధాన లక్ష్యాలు కేవలం పత్రాలకే పరిమితం కాకుండా ప్రతీ విద్యార్థికి నాణ్యమైన, సమానమైన, సమగ్ర విద్య అందేలా ఆచరణలోకి తీసుకురావాలని సూచించారు. ఇందులో ప్రధాన కార్యదర్శి సుదర్శన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వర్, నవీన్ కుమార్, ధీరజ్ కులకర్ణి, రాజేశ్వర్, చంద్రప్రకాశ్, దత్తురామ్ తదితరులు పాల్గొన్నారు.


