దూది రైతు దిగాలు | - | Sakshi
Sakshi News home page

దూది రైతు దిగాలు

Nov 13 2026 12:04 AM | Updated on Nov 13 2026 12:04 AM

ధర ఉన్నా దిగుబడి లేదాయె.. వర్షాభావంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం.. క్వింటాల్‌కు రూ.8,900కు చేరిన ధర దసరా ముహూర్తంలో రూ.9,400.. దీపావళి అనంతరం మళ్లీ పెరుగుదల

ఈ చిత్రంలోని రైతు పేరు సీహెచ్‌.సుదర్శన్‌. తానూరు మండలం బోల్సా గ్రామానికి చెందిన సుదర్శన్‌ తనకున్న 4 ఎకరాల్లో ఈ ఏడు పత్తిపంట సాగుచేశాడు. మొదట్లో పంట ఆశాజనకంగా ఉన్నా.. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన మేర వర్షాలు కురవలేదు. దీంతో పంట ఎదుగుల తగ్గింది. కాయకుళ్లు తెగుళ్లు, గులాబీ పురుగు ఆశించడంతో పంట దిగుబడి సగానికి పడిపోయింది. గతేడాది 4 ఎకరాల్లో పత్తి పంట సాగుచేస్తే 30 క్వింటాళ్ల పత్తి దిగుబడి రాగా, ఈసారి 4 ఎకరాల్లో కేవలం 15 క్వింటళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

భైంసా/తానూరు: ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతుకు చివరకు మిగిలేది అప్పులేనా? ఆకాశం వైపు ఆశతో చూసి వర్షం కోసం ఎదురుచూసి, పంటను కాపాడుకోవడానికి ఎన్నో కష్టాలు పడిన పత్తి రైతులకు ఈసారి నిరాశే ఎదురైంది. ఒకవైపు పెట్టుబడి ఖర్చులు పెరగడం, మరోవైపు వర్షాభావంతో దిగుబడి తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పత్తి ధర పెరుగుతున్నప్పటికీ, చేతికి వచ్చిన పంట తక్కువగా ఉండటంతో ఆశించిన ఆదాయం రావడం లేదు. జిల్లాలో ప్రస్తుతం క్వింటాల్‌ పత్తికి సుమారు రూ.8,900 పలుకుతోంది. ధర పెరుగుదల కొంత ఊరటనిస్తున్నా, తగ్గిన దిగుబడి నష్టాన్ని పూడ్చే అవకాశం లేదంటున్నారు.

దసరా నాడు ఆశలు... తర్వాత నిరాశ

ఈ సీజన్‌ ప్రారంభంలో పత్తి ధరలు రైతుల్లో ఆశలు రేకెత్తించాయి. దసరా ముహూర్తం సమయంలో క్వింటాల్‌కు రూ.9,400 వరకు పలికింది. దీంతో ఈసారి మంచి ధర లభిస్తుందని వారు భావించా రు. అయితే పండుగ తర్వాత ధరలు క్రమంగా తగ్గాయి. దసరా నుంచి దీపావళి వరకు పడిపోవడంతో ఆందోళన నెలకొంది. పంట చేతికి వచ్చే సమయంలో ధర రూ.8 వేల దిగువకు పడిపోయి నిరాశ కలిగించింది. దీపావళి అనంతరం ధరలు మళ్లీ కొంత పుంజుకుని క్వింటాల్‌కు రూ.8,900కు చేరాయి. దసరా నాటి ధరతో పోలిస్తే ఇంకా తగ్గుదల ఉండటం, దిగుబడి కూడా తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

పెట్టుబడి తగ్గలేదు..

పత్తి సాగులో రైతు పడే కష్టం చాలా ఎక్కువ. విత్తనాలు కొనుగోలు నుంచి భూమి దుక్కి, విత్తనాలు వేయడం, కలుపు తీయడం, ఎరువులు వేయడం, పురుగుల నివారణకు మందులు పిచికారీ చేయడం వరకు ప్రతి దశలో ఖర్చులు భరించాల్సి వస్తుంది. కూలీలు, ట్రాక్టర్‌, ఎరువులు, పురుగుమందుల ధరలు భారంగా మారాయి. పంట చేతికి వచ్చే వరకు ఎన్నో నెలలు శ్రమించాల్సి ఉంటుంది. ఇన్ని ఖర్చులు పెట్టినా వర్షాలు సరిగా కురవకపోవడంతో దిగుబడి సగానికి పడిపోయింది. సాధారణంగా 10 క్వింటాళ్లకు పైగా వచ్చేది ఈసారి ఐదు–ఆరు క్వింటాళ్లకే పరిమితం కావడంతో లెక్కలు తారుమారయ్యా యి. ధర కొంత పెరిగినా అమ్మకానికి తీసుకెళ్లే పరిమాణం తగ్గిపోవడంతో ఆదాయం కూడా తగ్గుతోంది. పెట్టుబడి ఖర్చులు, కుటుంబ అవసరాలు, అప్పులు తీర్చడం సవాల్‌గా మారింది.

భైంసా కేంద్రంగా వ్యాపారం

జిల్లాలో సుమారు 1.64 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. జిల్లాలో పత్తి కొనుగోళ్లు, వ్యాపారానికి భైంసా ప్రధాన కేంద్రం. అత్యధిక జిన్నింగ్‌ మిల్లులు ఇక్కడే ఉండటంతో సేకరణకు ఈ ప్రాంతం కీలకంగా మారింది. చుట్టుపక్కల గ్రామాల రైతులు పంటను విక్రయించేందుకు భైంసా వస్తుంటారు. ఇక్కడి మిల్లుల వద్ద జరిగే కొనుగోళ్లు, మార్కెట్‌ ధరల మార్పులు రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతున్నాయి. ఈసారి దిగుబడి తక్కువగా ఉండటంతో మార్కెట్‌కు వచ్చే పరిమాణం కూడా ఆశించిన స్థాయిలో లేదు.

ధర మరింత పెరిగితేనే..

ప్రస్తుతం రూ.8,900కు చేరడం కొంత ఊరటనిచ్చినా, ఈ ధరతో పెట్టుబడి ఖర్చులు పోను చేతికి ఎంత మిగులుతుందన్నదే అసలు ప్రశ్న. గతంలో ఎకరానికి 10 క్వింటాళ్లకు పైగా పండించిన వారు ఈసారి సగం దిగుబడితో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. సాగు సమయంలో చేసిన అప్పులు, కుటుంబ పోషణ, తదుపరి పంటకు పెట్టుబడి సమకూర్చుకోవడం వంటి బాధ్యతలు ఉన్నాయి. ధరలు మరింత పెరిగితేనే కొంతమేర నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు.

వర్షాభావంతోనే..

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవలేదు. దీంతో పంటల దిగుబడిపై ప్రభావం పడింది. పత్తిపంట దిగుబడి బాగా తగ్గింది. పూత కాత దశలో వర్షాలు కురవక పూతరాలిపోయింది. వేడికి కాయలు కూడా రాలిపోయాయి. ఖానాపూర్‌, పెంబి తదితర మండలాల్లో బోరుబావుల కింద పత్తి సాగు చేసిన రైతులకు మంచి దిగుబడి వస్తోంది.

– రవి ఇన్‌చార్జి డీఏవో

దిగుబడి సగానికి తగ్గింది

దిగుబడి సగానికి

ఈ ఏడాది పత్తి రైతులను ప్రధానంగా దెబ్బతీసింది వర్షాభావమే. పంట ఎదుగుదల, పూత, కాయ దశల్లో అవసరమైన సమయంలో వర్షాలు కురవక మొక్కలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. పత్తి కాయలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకుండా చిన్న సైజులోనే ఉండిపోయాయి. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. సాధారణంగా అనుకూల పరిస్థితుల్లో ఎకరానికి 10 క్వింటాళ్లకు పైగా వచ్చేది. కానీ ఈసారి చాలా ప్రాంతాల్లో ఐదు నుంచి ఆరు క్వింటాళ్లే వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే సగానికి పడిపోయిన పరిస్థితి నెలకొంది. పంటను కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రకృతి సహకరించకపోవడంతో ఆశించిన ఫలితం దక్కలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement