నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలకు 2026–27 విద్యా సంవత్సరానికి 12 పోస్ట్ గ్రాడ్యుయేట్(పీజీ) సీట్లు మంజూరయ్యాయి. కళాశాలలో పీజీ కోర్సుల ప్రారంభానికి సంబంధించి అన్ని విభాగాల్లో తనిఖీలు పూర్తయ్యాయి. 12 సీట్లకు ప్రతిపాదనలు సమర్పించగా అనుమతి లభించింది. ఇప్పటివరకు ఎంబీబీఎస్ విద్యను మాత్రమే అందిస్తున్న ఈ కళాశాల ఇకపై వైద్య నిపుణులను తయారు చేసే దిశగా మరో ముందడుగు వేసింది. మూడు విభాగాల్లో ఎండీ, ఎంఎస్ కోర్సులకు సీట్లు కేటాయించారు. ఎండీ జనరల్ మెడిసిన్‌కు 4, అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీకి 4, ఆర్థోపెడిక్స్‌కు 4 సీట్లు కేటాయించారు.
వైద్యవిద్యలో మరో మైలురాయి
పీజీ సీట్ల మంజూరుతో కళాశాలలో వైద్య విద్యా ప్రమాణాలు, వైద్య సేవలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. మూడేళ్లపాటు కొనసాగే ఈ కోర్సుల ద్వారా వివిధ విభాగాల్లో నిపుణులైన వైద్యులు తయారవుతారు. పీజీ విద్యార్థుల సేవలు అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు వైద్య సేవలు మరింత విస్తరిస్తాయి. ముఖ్యంగా జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్ వంటి కీలక విభాగాల్లో పీజీ వైద్యుల అందుబాటు ప్రయోజనకరంగా మారనుంది.
ప్రస్తుత భవనంలోనే..
మంజూరైన పీజీ సీట్లకు సంబంధించిన ప్రవేశాలు, విద్యా కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల నుంచి ప్రవేశ ప్రక్రియ మొదలుకానుంది. ప్రస్తుత ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనంలోనే పీజీ విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టల్ వసతి సౌకర్యాలు కల్పించనున్నారు. తరగతులు, క్లినికల్ శిక్షణతో పాటు వసతి పరంగా అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి తీసుకురానున్నారు.


