రసవత్తరంగా జోనల్‌స్థాయి పోటీలు | - | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా జోనల్‌స్థాయి పోటీలు

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

ఇచ్చోడ: మండల కేంద్రంలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్‌ పాఠశాలలో మంగళవారం స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా కబడ్డీ అండర్‌ 14, బాలురు, బాలికలు, హ్యాండ్‌ బాల్‌ అండర్‌ 17 బాలుర విభాగంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా జోనల్‌స్థాయి పోటీలు రసవత్తరంగా జరిగాయి. కబడ్డీ బాలికల పోటీలో ఆదిలాబాద్‌ జిల్లా జట్టు నిర్మల్‌ జిల్లా జట్టుపై గెలుపొందింది. కబడ్డీ బాలుర పోటీలలో ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లా జట్టుపై గెలుపొంది ప్రథమస్థానంలో నిలిచింది. హ్యాండ్‌బాల్‌ బాలుర విభాగంలో మొదటిస్థానంలో ఆసిఫాబాద్‌, రెండో స్థానంలో మంచిర్యాల జిల్లా జట్లు గెలుపొందినట్లు ఎస్‌జీఎఫ్‌ సెక్రెటరీ రామేశ్వర్‌ తెలిపారు. ఈ పోటీలలో మండల విద్యాశాఖ అధికారి కెసవత్‌ బిక్కు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాథోడ్‌ సురేశ్‌, పీడీలు సాయికుమార్‌, నాందేవ్‌, సాగర్‌, స్రవంతి, నామగణి పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఆసిఫాబాద్‌రూరల్‌: జోనల్‌ స్థాయి ఖోఖో, హ్యాండ్‌ బాల్‌ పోటీలు మంగళవారం రసవత్తరంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి జిల్లా ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల జోనల్‌స్థాయి అండర్‌ 14, 17 ఖోఖో బాలికలు, అండర్‌ 17 హ్యాండ్‌ బాల్‌ బాలికల పోటీలు పోటాపోటీగా జరిగాయి. క్రీడా పోటీలకు డీఈవో సచ్చిదానందచారి, డీవైఎస్‌వో అశ్వక్‌ హాజరై ప్రారంభించారు. పోటీల్లో మొత్తం 250 మంది క్రీడాకారులు పాల్గొనగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన 46 మందిని ఖోఖో, హ్యాండ్‌ బాల్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి రామ్మోహన్‌ రావు తెలిపారు.

విజేతలుగా నిలిచిన జట్లు..

జోనల్‌ స్థాయి ఖోఖో అండర్‌ 14 విభాగంలో మొదటి స్థానంలో కుమురం భీం, రెండో స్థానంలో ఆదిలాబాద్‌ జట్లు నిలిచాయి. ఖోఖో అండర్‌ 17 విభాగంలో మొదటి స్థానంలో కుమురం భీం జట్టు, రెండో స్థానంలో నిర్మల్‌ జట్లు నిలిచాయి. హ్యాండ్‌బాల్‌ అండర్‌ 17 బాలికల విభాగంలో మొదటి స్థానం కుమురం భీం, రెండో స్థానం నిర్మల్‌ జట్టు గెలుచుకుంది. కార్యక్రమంలో డీఎస్‌వో షేకు, నోడల్‌ అధికారి మీనారెడ్డి, హ్యాండ్‌ బాల్‌ కోచ్‌ అరవింద్‌, ఖోఖో అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కృష్ణ, అథ్లెటిక్స్‌ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్‌, పీడీలు, పీఈటీలు రాకేశ్‌, పాండు, ప్రవీణ్‌, శ్రీనివాస్‌, తిరమల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement