భిన్న సంస్కృతుల వెలుగుల సంబురం
నిర్మల్ జిల్లా.. అన్నిరాష్ట్రాల ఖిల్లా
ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకత..
సంప్రదాయాలు వేరైనా.. సంబరమొక్కటే!
వేడుకలు షురూ..
నిర్మల్:దీపావళి దేశమంతా జరుపుకునే వెలుగుల పండుగ. వేడుక ఒక్కటే అయినా ఆచారాలు, సంప్రదాయాలు, సంబరాల తీరు ప్రతీ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉంటాయి. భిన్న సంస్కృతుల కలయికగా నిలిచిన జిల్లా ఈ విషయంలో మినీ భారతంగా కనిపిస్తుంది. ఉపాధి, వ్యాపారం, ఉద్యోగాల కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన కుటుంబాలు తమ తమ సంప్రదాయాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. వారి ఇళ్లలో దీపావళి వేడుకలు ఎలా సాగుతాయి, ఏ రాష్ట్రం వారు ఎలాంటి ఆచారాలు పాటిస్తారు, ఏయే ప్రత్యేక వంటకాలు చేసుకుంటారు అనే అంశాలపై ప్రత్యేక కథనం.
భిన్న సంస్కృతుల ఖిల్లా..
జిల్లా వివిధ ప్రాంతాల ప్రజల సమ్మేళనం. ఉత్తరాన కాశ్మీరం నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు దేశాన్ని కలిపే 44వ జాతీయ రహదారి నిర్మల్ నడిబొడ్డు నుంచే వెళ్తోంది. ఈ మార్గం వల్ల మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి అనేక కుటుంబాలు ఇక్కడ స్థిరపడ్డా యి. ప్రాంతాలు మారినా తమ మూలాలను మాత్రం వారు మరచిపోలేదు. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా మెలుగుతూనే తమ ప్రత్యేక ఆచారాలను కాపాడుకుంటున్నారు. జిల్లాలోని వివిధ సంస్కృతలవారు దీపావళి జరుపుకునే తీరు వారి మాటల్లో..
గుజరాతీలకు దీపావళి కేవలం పండుగ మాత్రమే కాదు.. కొత్త సంవత్సర ఆరంభం కూడా. లక్ష్మీపూజతోపాటు వ్యాపారులు కొత్త ఖాతా పుస్తకాలను ప్రారంభిస్తారు. దీన్ని చోప్రాపూజ అంటారు. దీపావళి మరుసటి రోజు బెస్తువరస్ పేరుతో కార్తీకమాసం మొదటిరోజును గుజరాతీ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తాం. ఇళ్లను అలంకరించి, బంధుమిత్రులకు మిఠాయిలు పంచుకుంటాం.
–నర్మద, శాంతిలాల్పటేల్ దంపతులు


