నిర్మల్‌టౌన్: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తోందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బోనస్ ఇచ్చే పార్టీ కాదని.. బోగస్ చేసే పార్టీ అని ఎద్దేవా చేశారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇనన్‌చార్జి రాంకిషన్‌రెడ్డి నివాసంలో సోమవారం మాట్లాడారు. ఈనెల 11న నిర్మల్ పట ణంలో 50 వేల మందితో యువ గర్జన సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సభకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు. ప్రతీపల్లె, పట్టణంలో కేసీఆర్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. యువ గర్జన సభను విజయవంతం చేసేందుకు ప్రతీ గ్రామం నుంచి యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేసే దిశగా నవంబర్ 5న భారీ స్థాయిలో యువత పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. సమావేశంలో నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాంకిషన్‌రెడ్డి, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్య జాన్సన్ నాయక్, పార్టీ పట్టణ అధ్యక్షుడు రాము, సీనియర్ నాయకుడు రాజేందర్, కౌన్సిలర్ శ్రీకాంత్‌యాదవ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


