ఖానాపూర్: మండలంలోని బీర్నంది గ్రామపంచాయతీ పరిధి ఇప్పమడ గ్రామంలో రాజ్‌గోండు ఆదివాసీలు ఆదివారం భోగి పూజలతో దండారీ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. దీపావళి వేడుకల్లో భాగంగా దండారీ భోగి పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకొన్నారు. 10రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలు దీపావళి అనంతరం కొలాబుడీ వేడుకలతో ముగియనున్నాయి. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగలో డప్పు, తుడుం, కాళీకోమ్, పేప్రే లాంటి వాయిద్యాలతో పాటు కోలాటం, సంప్రదాయ నృత్యాలు, గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రాత్రింభవళ్లు డప్పుల మోతలు, గజ్జెల సవ్వళ్లతో గిరిజన గూడేలు పండుగ శోభను సంతరించుకోనున్నాయి. ఈ పండుగను తరతరా లుగా నియమనిష్టలతో నిర్వహిస్తున్నామని గ్రామ పెద్దలు పటేల్ పెందుర్ బాపురావు, ఇశ్రు, సురేశ్, లచ్చు, సత్తన్న, జైతు, దాంబాయి తెలిపారు.


