పీఎంశ్రీ విద్యార్థులకు డైరీలు | - | Sakshi
Sakshi News home page

పీఎంశ్రీ విద్యార్థులకు డైరీలు

Oct 30 2026 11:55 PM | Updated on Oct 30 2026 11:55 PM

● తొలిసారిగా పంపిణీ ● జిల్లాలో 20 పాఠశాలల విద్యార్థులకు అందజేత

లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ప్రధాన మంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా(పీఎంశ్రీ) పథకం కింద ఎంపికై న ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌స్థ్థాయి వసతులు కల్పిస్తోంది. ఇప్పటికే ల్యాబ్‌లు, లైబ్రరీలు, సంగీతం క్లాసులు నిర్వహిస్తోంది. ఇటీవల బతుకమ్మ పండుగకు ప్రత్యేక నిధులు ఇచ్చింది. ఈ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు విద్యార్థులకు మొదటిసారిగా డైరీలు అందజేసింది.

డైరీల్లోని వివరాలు

పీఎంశ్రీ పాఠశాలల్లో అందజేసిన డైరీల్లో విద్యార్థులు తమ పూర్తి వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంది. వీటిలో తరగతి టైమ్‌టేబుల్‌, పరీక్షలు, పనిదినాలు, సెలవులు, పాఠశాలలో, ఇంటివద్ద చేయాల్సిన పనుల వివరాలు ఉన్నాయి. కవర్‌ పేజీతోపాటు మొదటి పేజీలో విద్యార్థి వ్యక్తిగత వివరాలు, ఫొటో, పేరు, తరగతి, రూల్‌ నంబర్‌, ప్రవేశ సంఖ్య, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, ఆధార్‌ నంబర్‌, సెల్‌ నంబర్‌, పాఠశాల పేరు, యూఐడీ నంబర్‌ నమోదు చేసి విద్యార్థి, తరగతి ఇన్‌చార్జ్‌ ఉపాధ్యాయుడి సంతకాలు చేయాలి. పాఠశాల మొదటి పనిదినం నుంచి చివరి రోజు వరకు ప్రతిరోజూ విద్యార్థులు ఈ డైరీలో రాయాల్సి ఉంటుంది. అలాగే పరీక్ష తేదీలు, ఎఫ్‌ఏ, ఎస్‌ఏ, ఎస్‌ఎస్‌సీ బోర్డు పరీక్షలు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు ఇచ్చే సూచనల కోసం ‘నోట్‌ టు ది పేరెంట్‌’ కాలమ్‌ కూడా ఉంది.

ఉత్తమ లక్షణాలు అలవడతాయి

పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందించిన డైరీలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతీరోజు ఆ రోజు చేసిన పనులు, చదివిన అంశాలు, చదవాల్సిన అంశాలను క్రమం తప్పకుండా నమోదు చేయాలి. నిత్యం రాయడం వల్ల క్రమశిక్షణ అలవడుతుంది. ముందుకు ఎలా సాగాలో అర్ధం అవుతుంది. – రాజునాయక్‌, ఎంఈవో, లక్ష్మణచాంద

జిల్లాలో ఇలా..

నిర్మల్‌ జిల్లాలో మొత్తం 715 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిలో 40,365 మంది విద్యార్థులు చదువుతున్నారు. పీఎంశ్రీ పాఠశాలలు 20 ఉండగా, వాటిలో 8,200 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి విద్యాశాఖ అధికారులు డైరీలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement