నర్సాపూర్(జి): రోజువారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని భూముల రీసర్వే త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అధికారులను ఆదేశించారు. నర్సాపూర్ (జి) మండలం చాక్పల్లి గ్రామంలో కొనసాగుతున్న రీసర్వేను శుక్రవారం తనిఖీ చేశారు. వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం రీసర్వే చేయాల్సిన భూమి, పట్టా భూములు, ఎస్సారెస్పీ భూములు, ఇతర భూముల వివరాలను అడిగారు. హద్దుల గుర్తింపు పక్కాగా ఉండాలన్నారు. సభ్యుల పర్యవేక్షణలో, రైతుల సమక్షంలో మాత్రమే సర్వే చేపట్టాలన్నారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ... సాగు చేసిన పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి కొరత అంశాలను బేరీజు వేసుకుని తక్కువ నీటితో పండే పంటలు యాసంగిలో వేసుకోవాలని సూచించారు. వ్యవసాయ క్షేత్రంలో పంట కుంటలు(ఫామ్ పాండ్)లు నిర్మించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, సర్వేయర్ విలాస్, సర్పంచ్ మ్యాదరి సుధాకర్, ఇరిగేషన్ ఏఈ గంగాధర్, పంచాయతీ కార్యదర్శి నరేశ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


