జిల్లా కేంద్రంలో యథేచ్ఛగా కబ్జాలు దర్జాగా కోటలు, కందకాల్లో పట్టాలు ‘పోరంబోకు’ను వదలని కబ్జాకోరులు గత కలెక్టర్ హయాంలో టాస్క్‌ఫోర్స్ నేటికీ కనిపించని అధికారిక చర్యలు
రోడ్డుపక్కన ఉండటమే పాపమా?
నిర్మల్: కొయ్యబొమ్మలు, కోట బురుజులు, నల్లని గుట్టలకు ప్రసిద్ధి చెందిన నిర్మల్ కబ్జాలకు కేరాఫ్‌గా మారింది. తాజాగా ధర్మసాగర్ చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు చేపట్టడం, కలెక్టర్ స్వయంగా వాటిని తొలగింపజేయడంతో మరోసారి జిల్లాకేంద్రంలోని కబ్జాలపర్వం తెరపైకి వచ్చింది. గత కలెక్టర్ అభిలాష అభినవ్ హయాంలో స్థానిక అయ్యప్ప టెంపుల్ ఎదురుగా ప్రభుత్వభూమి ఆక్రమణపై ‘బుల్డోజర్’ ప్రయోగించారు. ఒత్తిళ్లకు లొంగకుండా కబ్జాల పనిపట్టాలంటూ రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, పోలీసుశాఖల అధికారులతో ‘టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు చేశారు. పలు ఆక్రమణలనూ అప్పట్లో గుర్తించినా ఇప్పటికీ అధికారికంగా చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
పురావస్తు ప్రాపర్టీలో రెవెన్యూ పట్టాలు
చారిత్రక కట్టడమైన శ్యాంగఢ్‌లో ఎప్పుడో రెవెన్యూ అధికారులు పట్టాలిచ్చారు. అసలు పురావస్తు ప్రాపర్టీలో రెవెన్యూ పట్టాలు జారీ చేయడం ఏమిటన్న ప్రశ్న ఇప్పటికీ ఉంది. గతంలో ఇచ్చిన పట్టాదారులకు వేరే చోట భూకేటాయింపులు చేసి, శ్యాంగఢ్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఆచరణలోకి రావడం లేదు. శ్యాంగఢ్ లోపలే కాదు.. చుట్టూ ఉన్న పోరంబోకు భూములకూ పట్టాలిచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ భూములపై పూర్తి విచారణ చేపట్టాలని గత కలెక్టర్ ఉన్నప్పుడు ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేశారు. చెరువులు, కందకాల్లో చేపట్టిన నిర్మాణాలనూ క్రమబద్ధీకరించడంపైనా ఫిర్యాదులున్నాయి. ప్రియదర్శినినగర్, విశ్వనాథ్‌పేట్, గాజుల్‌పేట్ తదితర ఏరియాల్లోని దేవుడి మాన్యాల్లోనూ దొంగదారిలో పట్టాలు చేయించుకున్నట్లు ఆరోపణలున్నాయి.
అసైన్డ్, ఎఫ్‌టీఎల్‌లో వెంచర్లు
జిల్లాకేంద్రంలో చాలావరకు వెంచర్లు అసైన్డ్ భూ ముల్లోనే ఉండటం గమనార్హం. భూమిలేని పేదల పేరిట ఉండాల్సిన అసైన్డ్‌ల్యాండ్స్ చాలావరకు ఇ ప్పుడు బడాబాబుల చేతుల్లోకి మారాయి. వీటిలో చేసిన వెంచర్లకు అనుమతులు, ప్లాట్లకు రిజిస్ట్రేష న్లూ అవుతుండటం గమనార్హం. ప్రియదర్శినినగర్ లాంటి ఖరీదైన ఏరియాలో గల చిన్నరాంసాగర్ (మంజులాపూర్) చెరువు చుట్టూ కబ్జాకు గురవుతోంది. ఇక్కడి ఎఫ్‌టీఎల్ హద్దుల గుర్తింపు సరిగా లేక ఇష్టారీతిన ఆక్రమణలు కొనసాగుతున్నాయి.
‘బుల్డోజర్’ సాగుతుందా?
జిల్లాకేంద్రంలో ఆక్రమణలపై ఎన్ని ఫిర్యాదులు, వార్తలు వస్తున్నా.. సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు న్నాయి. గత కలెక్టర్ అసైన్డ్ పేరిట ప్రభుత్వ భూమి ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో దివ్యగార్డెన్ పక్కన భూముల్లో బుల్డోజర్‌తో నిర్మాణాలు తొలగించారు. ఆ తర్వాత అది మధ్యలోనే నిలిచిపోయింది. తాజాగా కలెక్టర్ భవేశ్‌మిశ్రా ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలపై సీరియస్‌గా స్పందించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈప్రక్రియను ఇలాగే కొనసాగించాలని, మిగతా ఆక్రమణలపైనా చర్యలు చేపట్టాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, గతంలో ఏర్పాటు చేసిన ‘టాస్క్‌ఫోర్స్’ తరహాలోనే పేరుకే నిలిచిపోతరా.. లేక కబ్జాల లెక్క తేలుస్తారా..! వేచిచూడాల్సిందే.
ఎఫ్‌టీఎల్‌లో
నిర్మాణాలు చేపట్టరాదు
చెరువులకు సంబంధించిన భూముల్లో ఎలాంటి ఆక్రమణలు చేపట్టరాదు. ఎఫ్‌టీఎల్‌లో పట్టా భూములున్నా వాటిలో ఎలాంటి నిర్మాణాలు చేయొద్దు. కలెక్టర్ ఆదేశాల మేరకు ధర్మసాగర్‌లో నిర్మాణాలు తొలగించాం.
– అనిల్‌కుమార్, ఇరిగేషన్ ఈఈ
ప్రధాన రహదారికి పక్కన ఉండటమే ఇక్కడి కందకం చేసుకున్న పాపమన్నట్లుగా ఉంది. ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని చైన్‌గేట్ వద్ద కందకానిది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఈ కందకం మొత్తం కబ్జాకు గురై చిన్నమురుగు కాలువలా మారిపోయింది. రూ.కోట్లలో భూముల విలువ ఉండటంతో ఇలా నిర్మల్‌లో కందకాలనూ వదలకుండా ఆక్రమించేస్తున్నారు. ఈ ఆక్రమణలకు గతంలో నిర్మల్‌లో పనిచేసిన పలువురు రెవెన్యూ అధికారులూ సహకరించినట్లు ఆరోపణలున్నాయి.


