భైంసా: ప్రభుత్వం కరువు మండలాల జాబితా వి డుదల చేయడంతో వర్షాభావ పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వ సాయం అందితే కొద్దిపాటి ఉపశమనమైనా లభిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే వ ర్షాభావంతో పంటలు, దిగుబడులపై ప్రభావం పడగా.. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన సహాయక చర్యలు ఎంతవరకు ప్రయోజనం చేస్తాయోనని ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో వర్షపాతం ఇలా..
జిల్లాలోని తొమ్మిది మండలాలను ప్రభుత్వం కరు వు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించింది. ఖానాపూర్‌ను తీవ్ర కరువు ప్రభావిత మండలంగా, కుభీర్, భైంసా, కుంటాల, నిర్మల్ అర్బన్, సోన్, లక్ష్మణ చాంద, కడెం పెద్దూర్, దస్తూరాబాద్ మండలాలను మోస్తరు కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది. జూన్ 1నుంచి అక్టోబర్ 19వరకు నమోదైన వర్షపాత గణాంకాలను పరిశీలిస్తే కుభీర్ మండలంలో అత్యధికంగా 49శాతం లోటు నమోదైంది. సాధారణంగా 975.7 మి.మీ. వర్షపాతం న మోదు కావాల్సి ఉండగా.. 495.5 మి.మీ. మాత్రమే కురిసింది. తానూర్‌లో సాధారణ వర్షపాతం 950.1 మి.మీ. కాగా.. 537.6 మి.మీ. వర్షం మాత్రమే నమోదై 42శాతం లోటు ఏర్పడింది. బాసరలో 37శాతం, కుంటాలలో 34, సారంగపూర్‌లో 32, ముధోల్‌లో 31, భైంసాలో 30శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కుభీర్, తానూర్‌ను గుర్తించాలని..
వర్షపాతం లోటు అధికంగా ఉన్న కుభీర్, తానూర్ మండలాల్లో కరువు పరిస్థితులను క్షేత్రస్థాయిలో అ ధికారులు సమగ్రంగా పరిశీలించాలని రైతులు కో రుతున్నారు. వర్షపాతం గణాంకాలతోపాటు పంట ల ప్రస్తుత పరిస్థితి, భూముల్లో తేమశాతం, దిగుబ డులపై ప్రభావం, సాగు ఖర్చులు తదితర అంశాల ను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఈ మండలాల ను తీవ్ర కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తిస్తే మ రింత ప్రయోజనముంటుందని భావిస్తున్నారు.
అన్నదాతల్లో చిగురిస్తున్న ఆశలు
కరువు ప్రభావిత మండలాల్లో అర్హులైన రైతులకు పంట పెట్టుబడి రాయితీతో పాటు తాగునీటి సరఫరా, పశువుల మేత లాంటి ఉపశమన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ఈ చర్యలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతాయన్నది కీలకంగా మారింది. పంట నష్టాలను సమగ్రంగా అంచనా వేసి, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులకు సకాలంలో ఆర్థికసాయం అందించాలని రైతులు కోరుతున్నారు. పశువులకు మేత కొరత ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.


