కరువు.. దరువు | - | Sakshi
Sakshi News home page

కరువు.. దరువు

Oct 28 2026 12:12 AM | Updated on Oct 28 2026 12:12 AM

● ఖానాపూర్‌లో తీవ్రం.. 8 మండలాల్లో మోస్తరు.. ● జీవో జారీ చేసిన ప్రభుత్వం ● పెట్టుబడి రాయితీపై రైతుల ఆశలు

భైంసా: జిల్లాలో వర్షాభావ పరిస్థితులు వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో 2026 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి జిల్లాలోని తొమ్మిది మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఖానాపూర్‌ మండలాన్ని తీవ్ర కరువు ప్రభావితంగా గుర్తించగా, మరో ఎనిమిది మండలాలను మోస్తరు కరువు ప్రభావితంగా ప్రకటించింది. రెవెన్యూ (డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌– II) శాఖ ఈ నెల 24న జారీ చేసిన జీవో 3లో ఈ వివరాలు పేర్కొన్నారు.

రైతులకు పెట్టుబడి రాయితీ..

కరువు ప్రభావిత మండలాల్లో అర్హులైన రైతులకు పంట పెట్టుబడి రాయితీ అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కేంద్రం నుంచి జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి(ఎన్‌డీఆర్‌ఎఫ్‌) కింద సహాయం అందిన తర్వాత నెల రోజుల్లోగా డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌(డీబీటీ) ద్వారా రైతుల ఖాతా ల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖకు సూచించా రు. లబ్ధిదారుల జాబితాలను జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్లలో ప్రచురించాలని పేర్కొన్నారు.

తాగునీరు, పశుగ్రాసంపై దృష్టి

తాగునీటి సరఫరా మెరుగుపరచడం, పశువులకు మేత అందుబాటులో ఉంచడం, అవసరమైతే పశువుల శిబిరాలు ఏర్పాటు, ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రుణాల పునర్వ్యవస్థీకరణ, వసూళ్లకు సంబంధించి వర్తించే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆరు నెలలపాటు అమలు

కరువు ప్రభావిత మండలాల ప్రకటన ఆరు నెలలు అమల్లో ఉంటుంది. పరిస్థితులను బట్టి ముందుగానే ఉపసంహరించవచ్చు లేదా అవసరమైతే అదనపు మండలాలను తదుపరి నోటిఫికేషన్‌ ద్వారా చేర్చవచ్చు. తొమ్మిది మండలాలు జాబితాలో చేరడంతో పంట నష్టాల అంచనా, అర్హుల గుర్తింపు, రాయితీ పంపిణీపై రైతులు ఆశలు పెట్టుకున్నారు.

జిల్లా సగటు వర్షపాతం

జిల్లాలో సాధారణ వర్షపాతం 966.3 మి.మీ. కాగా, ఈ ఏడాది 731 మి.మీ. నమోదైంది. దీంతో జిల్లాలో 235.3 మి.మీ లోటు ఏర్పడి, సాధారణం కంటే 24 శాతం తక్కువ వర్షాలు కురిశాయి.

కుంటాల మండలం వేంకూర్‌లో ఎండిపోయిన పొలం

ఖానాపూర్‌లో తీవ్ర కరువు

ఖానాపూర్‌ను తీవ్ర కరువు ప్రభావిత మండలంగా ప్రభుత్వం గుర్తించింది. కుభీర్‌, భైంసా, కుంటాల, నిర్మల్‌ అర్బన్‌, సోన్‌, లక్ష్మణచాంద, కడెం పెద్దూర్‌, దస్తూరాబాద్‌ మండలాలను మోస్తరు కరువు ప్రభావితంగా ప్రకటించారు. జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు వర్షపాతం, వ్యవసాయ శాఖ నివేదికలు, ఉపగ్రహ ఆధారిత వృక్షసంపద సూచికలు, నేల తేమ, భూగర్భ జలాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తీవ్రతను అంచనా వేశారు. ఎల్‌నినో ప్రభావం, వర్షపాత లోటు, దీర్ఘకాలిక పొడి వాతావరణం వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement