న్యూస్‌రీల్
పచ్చి వడ్లు కొనుగోలు చేస్తున్న వైనం.. నిత్యం వ్యాన్లలో ధాన్యం సేకరణ ఏపీ, మహారాష్ట్ర, కర్నాటకకు తరలింపు కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షణకన్నా మేలే అంటున్న రైతులు
నిర్మల్
‘ఎకో’ పరిధి.. పరేషాన్
ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిపై కవ్వాల్ టైగర్‌జోన్ పరిధిలోని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అభివృద్ధి పనులకు నిబంధనలు ఆటంకంగా మారుతుండడంతో వ్యతిరేకత పెరుగుతోంది.
హక్కులపై అవగాహన
నర్సాపూర్ (జి): హక్కులపై అందరికీ అవగాహన ఉండాలని జిల్లా అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి.నిఖిత అన్నారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో నర్సాపూర్(జి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సురక్షిత్ బచ్‌పన్ అభియాన్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. బాలల హక్కుల పరిరక్షణ, బాలలపై లైంగిక నేరాల నిరోధం, బాలల భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సురక్షిత్ బచ్‌పన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వక్తలు తెలిపారు. లైంగిక నేరాల నిరో ధానికి పోక్సో చట్టం–2012 కీలకమైంద ని పేర్కొన్నారు. పిల్లలకు వారి హక్కులు, చట్టాల పై అవగాహన కల్పించాలని, చెడు వ్యసనాలతో కలిగే దుష్ప్రభావాలను వివరించాలని తెలి పారు. కార్యక్రమంలో న్యాయవాది షేర్ నరేందర్, ఎస్సై గణేశ్, పాఠశాల హెచ్‌ఎం రవీంద్రకుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ రైతు పేరు యాంబరి చిన్నగంగాధర్. పంచగుడి గ్రామానికి చెందిన ఈయన తనకు ఉన్న 9 ఎకరాల్లో వానాకాలం సన్నరకం వరి సాగు చేశాడు. పంట కొత దశకు రాగానే 6 ఎకరాల వరి కోశారు. విషయం తెలుసుకున్న ప్రైవేటు వ్యాపారులు నేరుగా పొలం వద్దకే వచ్చారు. క్వింటాల్‌కు రూ.2800 చొప్పున చెల్లించి పచ్చి వడ్లు కొనుగోలు చేస్తామని తెలిపారు. దీంతో చిన్నగంగాధర్ ఆలోచనలో పడ్డాడు. వడ్లు ఆరబెట్టి.. మాయిశ్చర్ రాకకోసం రోజుల తరబడి నిరీక్షించి, తూకం పెట్టేందు రోజుల తరబడి కల్లంలో వేచి ఉండాల్సి వస్తుందని, ప్రభుత్వం డబ్బులు చెల్లించడానికి కూడా నెల సమయం పడుతుందని భావించాడు. దీంతో వ్యాపారికి విక్రయించడమే మేలని భావించాడు. మొత్తం పచ్చివడ్లు విక్రయించాడు.
లోకేశ్వరం: రైతులు ఎల్‌నినోకు ఎదురొడ్డి.. సుమారు ఆరు నెలలు రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన వరి పంటపై దళారీలు వాలిపోతున్నారు. ఎల్‌నినో కారణంగా వర్షాలు తగ్గాయి. తెగుళ్లు పెరిగాయి. ఫలితంగా దిగుబడి కూడా తగ్గింది. ఇక యాసంగిలో వరి వేయొద్దని ప్రభుత్వమే సూచిస్తోంది. దీంతో వడ్లకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో దళారులు పల్లెల్లోకి దిగారు. నేరుగా పొలాల వద్దనే వాలుతున్నారు. తాలు, తప్పతో సంబంధం లేకుండా పచ్చి వడ్లనే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఏటా తేమ శాతం, తాలు పేరిట తూకంలో కోత, హమాలీలు, లారీల కొరత, డబ్బులు త్వరగా ఖాతాల్లో జమ కాకపోవడం వంటి సమస్యలతో రైతులు సతమతమవుతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకున్న దళారులు పొలం వద్దకే వచ్చి సన్నరకం పచ్చి వడ్లను కొనుగోలు చేస్తున్నారు.
రెండు మండలాల్లో విక్రయాలు
జిల్లాలోని ముధోల్, లోకేశ్వరం మండలాల్లో పచ్చివడ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నిత్యం సుమారు పది లారీల్లో పచ్చి ధాన్యం వ్యాపారులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తున్నారు. సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,800 చొప్పున చెల్లిస్తున్నారు. 70 కిలోల బస్తాకు మూడు కిలోలు కోత వేస్తున్నారు. కొనుగోలు చేసిన తర్వాత రైతులకు నగదు లేదా చెక్కుల రూపంలో చెల్లించడానికి 15 నుంచి 20 రోజుల గడువు పెడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే ఎక్కువగా చెల్లించి ధాన్యం తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి మద్దతు ధర రూ.2,441గా నిర్ణయించి, అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది.
అమ్మడానికి అష్టకష్టాలు..
విత్తనం విత్తినప్పటి నుంచి మొదలైన కష్టాలు ధాన్యం అమ్ముకునే సమయంలోనూ వీడడం లేదు. గతేడాది కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అడ్డగోలు నిబంధనలంటూ వడ్లు కొనేందుకు కొర్రీలు పెట్టారు. ఇక ప్రభుత్వం బోనస్ చెల్లింపులో జాప్యం చేస్తోంది. ఈ సమస్యలను భరించలేక ప్రైవేటు వ్యాపారులకు క్వింటాల్‌కు ధర రూ.2,800 చొప్పున పచ్చి వడ్లు అమ్మేశాను. – మంద లింగన్న, రైతు, ధర్మోర
జిల్లాలో వరి కొనుగోలు కేంద్రా వివరాలు..
జిల్లాలో వానాకాలం సాగుచేసిన వరి 1.37 లక్షల ఎకరాలు
ధాన్యం దిగుబడి అంచనా
1,43,065 మెట్రిక్ టన్నులు
గతేడాది కొనుగోలు చేసిన ధాన్యం1.14 లక్షల మెట్రిక్ టన్నులు
ప్రభుత్వంపై నమ్మకం లేక
రైతు భరోసా డబ్బులు సకాలంలో జమ కాకపోవడం, రుణమాఫీ పూర్తిగా అమలు కాకపోవడం, బోనస్ డబ్బులు కూడా సకాలంలో చెల్లించకపోవడంతో రైతుల్లో ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లింది. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలుకు అనేక కొర్రీలు పెడుతుండడం, టార్పాలిన్ల భారం, గన్నీ బ్యాగుల భారం రైతులపైనే పడుతుండడంతో వీటిని లెక్కించి మరీ రైతులు పచ్చి వడ్లనే ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ధాన్యం అమ్మకంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన వ్యాపారులు పచ్చి వడ్ల దందాకు తెరలేపినట్లు సమాచారం.


