జోడేఘాట్‌లో ఘనంగా కుమురంభీం 86వ వర్ధంతి గిరిజన సంప్రదాయం ప్రకారం నివాళులు హాజరైన మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సీతక్క నాలుగు గంటలపాటు కొనసాగిన దర్బార్
కెరమెరి/ఆసిఫాబాద్‌అర్బన్: పోరుగడ్డ జోడేఘాట్ పులకించింది. ఆదివాసీ ముద్దుబిడ్డ, గోండు బెబ్బు లి కుమురంభీంకు నివాళులర్పించేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు ఉమ్మ డి జిల్లా నుంచి ప్రజానీకం తరలివచ్చింది. అమరుడికి గిరిజన సంప్రదాయం ప్రకారం నివాళులర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో సోమవారం కుమురంభీం 86 వర్ధంతి ఘనంగా నిర్వహించారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూ రి లక్ష్మణ్‌కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ సీతక్క హాజరయ్యారు. వారిని గుస్సాడీ నృత్యంతో స్వాగ తం పలికారు. అనంతరం వారు ఆదివాసీలు, భీం వారసులతో కలిసి సంప్రదాయ పూజలు చేశారు. కుమురం భీంతోపాటు కొలాం వీరుడు కుమురం సూరుకు నివాళులర్పించారు. అంతకుముందు నాలుగు గోత్రాల జెండాలు ఆవిష్కరించారు.
ఆకట్టుకున్న కార్యక్రమాలు
జోడేఘాట్‌లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గోండ్‌గూడ అంగన్‌వాడీ కేంద్రం చిన్నారులు, గుస్సాడీలు చేసిన నృత్యాలు అలరించాయి. వివిధశాఖల స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలి చాయి. ఐటీడీఏ పీవో మంద మకరందు ధోవతి, రుమాలు కట్టుకుని గోండి భాషలో మాట్లాడారు. ఆరుగురు గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు అందించారు. ఉన్నత విద్యనభ్యసిస్తున్న మడావి దత్తు, కోట్నాక్ సంజీవనిలకు ల్యాప్‌టాప్‌లు అందించా రు. భీం మనుమడు సోనేరావు, ఇతర వారసులకు దుస్తులు అందించి సత్కరించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, డీఎస్పీ అశోక్, అదనపు ఎస్పీ, డీటీడబ్ల్యూవో అంబాజీ, డీఎంహెచ్‌వో నాగేంద్ర, ఎస్‌ఈ ఉత్తమ్ జాడె, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ ఎమ్మెల్యే సక్కు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరిగెల నాగేశ్వర్‌రావు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక విజయ్, జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్, ఉత్సవ కమిటీ చైర్మన్ పెందూర్ రాజేశ్వర్, సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు, చంద్రన్న, శంకరన్న పాల్గొన్నారు.
వచ్చే వర్ధంతిలోగా సమస్యల పరిష్కారం
వచ్చే భీం వర్ధంతిలోగా సమస్యలు పరిష్కరించి పోడు భూములకు పట్టాలు, సాగు, తాగునీరు అందిస్తాం. 40ఏళ్ల క్రితం ఎలాంటి సౌకర్యాలు లేనప్పుడు వర్ధంతికి వచ్చిన జనం, ఇప్పుడు అన్ని సౌకర్యాలు వచ్చాక రాకపోవడం సరికాదు. సమ్మక్క, సారక్క, భీం, రాంజీగోండు వంటి వీరులను స్ఫూర్తిగా తీసుకోవాలి. కుమురం భీం, ఆదిలాబాద్ జిల్లాల్లో గిరిజనులు అధికంగా ఉంటారు. నిబంధనల పేరుతో అధికారులు కఠినంగా వ్యవహరిస్తే వారి జీవనం మరింత కష్టమవుతుంది. ఇప్పటికే కుమురం భీం జిల్లాలో రూ.180 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. సిర్పూర్‌కు తన నిధుల నుంచి రూ.60 కోట్లు వెచ్చించాను. – మంత్రి సీతక్క
సీఎంతో చర్చిస్తాం
ఆదివాసీల అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తాం. గిరిజన గ్రామాల్లో అటవీ నిబంధనలతో సమస్యలు పేరుకుపోయాయి. గిరిజనులకు శాశ్వత హక్కు ఉండేలా పోడు భూములకు పట్టాలు, ఇతర సమస్యలను పరిష్కరిస్తాం. ఐటీడీఏలకు పూర్వవైభవం తీసుకువచ్చి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం. – మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
సమస్యల ఏకరువు
దర్బార్ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కుమురం భీం నినదించిన జల్, జంగల్, జమీన్ ఆశయం నేటికీ నెరవేరలేదన్నారు. చాలా గ్రామాల్లో తాగునీరు, రోడ్డు సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఇసుక, పందిరి వేసేందుకు వెదురు తెచ్చుకోవడానికి కూడా అడ్డుపడుతున్నారని బాధలు వినిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గిరిజనులకు వందశాతం ఇందిరమ్మ గృహాలు ఇస్తామని ఇచ్చిన మాటను సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. కలెక్టర్ హరిత మాట్లాడుతూ ప్రతీ గిరిజన గ్రామానికి నిరంతరం తాగునీరు అందించేందుకు సావర్‌ఖెడా సమీపంలో రూ.60 కోట్లతో ఇంటెక్‌వెల్ నిర్మిస్తున్నామని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ నితిక పంత్ సూచించారు. పిల్లల ను బాగా చదివించాలని, గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.


