ఖానాపూర్/కడెం: రైతుల పంటలకు అవసరమైన సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలి పారు. ఖానాపూర్ మండలం మేడంపల్లిలో ని పాత సదర్మాట్ అనకట్టను సోమవారం పరిశీలించారు. నీటి లభ్యత, సాగునీటి సరఫరాపై నీటిపారుదల శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సదర్మాట్ బ్యారేజీలో ప్రస్తుతం ఒక టీఎంసీ నీరు ఉందని, పంటలు కోత దశకు చేరుకున్న నేపథ్యంలో అవసరమైన మేరకు అందిస్తామని తెలిపారు. కడెం మండలం మద్దిపడగ గ్రామ సమీపంలో సాగు నీరందక ఎండిన పొలాలను సందర్శించారు. నది పరీవాహక ప్రాంతంలో నీటి మళ్లింపులను తొలగిస్తే పంటలకు నీరు అందించడంలో ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు. రైతులు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. మంగళవారం నుంచి విడుదల చేసే సాగు నీరు చివరి ఆయకట్టు వరకు అందేలా ఇరిగేషన్, పంచాయతీరాజ్, రెవెన్యూ సిబ్బందితోపాటు రైతులతో కలిసి చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో తహసీల్దార్ మొయినుద్దీన్, ఈఈ ప్రవీణ్, ఎంపీడీవో అరుణ, సర్పంచులు జడ లావణ్యకృష్ణ, శకుంతలరామగౌడ్, మాజీ ఎంపీపీ అమ్మిబాపురావు, రైతులు ఉన్నారు.


