నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో దసరా వేడుకలు అంబరాన్నంటాయి. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక మహాలక్ష్మీ ఆలయంలో అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వనులతో మారుమోగింది. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు, హైందవ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొదటగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం, సంప్రదాయ బద్ధంగా షమీ (జమ్మి) చెట్టుకు, ఆయుధాలకు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకలకు ప్రధాన వక్తగా హాజరైన హిందూవాహిని ప్రధాన సంఘటన మంత్రి ముడుపు యాదిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనది హిందూ సంస్కృతి అని, హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ రావణాసురుడి ప్రతిమను దహనం చేశారు. ఈ మనోహర ఘట్టాన్ని తిలకించేందుకు ప్రజలు, భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో, భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా ముగిశాయి.
‘జ్ఞాన సరస్వతి’గా దర్శనమిచ్చిన అమ్మవారు
బాసర: బాసరలోని బాలాలయంలో తొమ్మిది రోజుల పాటు భక్తులకు నవదుర్గల రూపాల్లో దర్శనమిచ్చిన చదువుల తల్లి మంగళవారం ‘జ్ఞాన సరస్వతి’ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, వేద పండితులు విశేష మహా నివేదన సమర్పించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. సాయంత్రం 6 గంటలకు అమ్మవారి రథోత్సవం ప్రారంభమైంది. అనంతరం షమీపూజ (జమ్మి పూజ), ప్రత్యేక నైవేద్యం, మహా హారతి, మంత్రపుష్పము కార్యక్రమాలు నిర్వహించారు. ఏటా 8 గంటలకు ఆలయానికి చేరుకునే అమ్మవారి రథం, ఈసారి భక్తుల రద్దీ కారణంగా రాత్రి 10 గంటల తర్వాత చేరుకుంది. దీంతో రాత్రి 11:30 గంటలకు మహాహారతి ఇచ్చారు.
జిల్లా కేంద్రంలో రావణ దహనం
పూజలు చేస్తున్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి


