బోథ్: ఉమ్మడి జిల్లాలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. సాధారణంగా వేసవిలో కనిపించే అధిక విద్యుత్ డిమాండ్ ఈ ఏడాది అక్టోబర్‌లోనే నమోదవుతోంది. గతేడాది అక్టోబర్‌లో 393 మెగావాట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్ ఈ ఏడాది అదే నెలలో 689 మెగావాట్లకు చేరింది. ఏడాది వ్యవధిలోనే 296 మెగావాట్ల పెరుగుదల నమోదైంది. గతేడాదితో పోలిస్తే సుమారు 75.3 శాతం అధికంగా విద్యుత్ వినియోగం పెరిగింది.
సాగునీటి కోసం మోటార్ల వినియోగం
ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులు, నేలలో తేమ తగ్గడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు బోర్లు, బావులు, కాలువల ద్వారా సాగునీటిని అందిస్తున్నారు. దీంతో వ్యవసాయ మోటార్ల వినియో గం పెరిగి విద్యుత్ డిమాండ్‌పై ప్రభావం పడుతోంది. రబీ పంటల సాగు పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సాగునీటి అవసరాలు కూడా పెరుగుతున్నాయి. వ్యవసాయ రంగంలో విద్యుత్ విని యోగం పెరగడం మొత్తం డిమాండ్‌పై ప్రభావం చూపుతోంది.
ఇళ్లలోనూ పెరిగిన వినియోగం..
మరోవైపు పగటి ఉష్ణోగ్రతల ప్రభావంతో ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు తదితర విద్యుత్ పరికరాల విని యోగం పెరుగుతోంది. వ్యవసాయ అవసరాలతో పాటు గృహవిద్యుత్ వినియోగం కూడా అధికమవడంతో డిమాండ్ పెరుగుతోంది.
రోజురోజుకూ పెరుగుదల
విద్యుత్ డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఆదివారం 663 మెగావాట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్ సోమవారం 689 మెగా వాట్లకు చేరింది. ఒక్కరోజులోనే 26 మెగావాట్ల పెరుగుదల నమోదైంది. ఇది సుమారు 3.9శాతం అధికం. ప్రస్తుతం విద్యుత్ సరఫరా అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఎన్నడూ లేనంత డిమాండ్
ఉమ్మడి జిల్లాలో గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. వ్యవసాయ అవసరాలతో పాటు ఇతర రంగాల్లో విద్యుత్ వినియోగం పెరిగింది. ఇంత భారీగా డిమాండ్ పెరిగినప్పటికీ వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. అవసరాలకు అనుగుణంగా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు కృషి చేస్తున్నాం.
– జాదవ్ సుభాష్, ఎస్‌ఈ, ఆదిలాబాద్


