కళల ఖిలాల్లో పురుడోసుకుంటున్న బతుకమ్మ పాటలు పండుగవేళ స్థానిక సృజనకు విశేష ఆదరణ నటీనటులు, దర్శకులు, కెమెరా మెన్లు మనోళ్లే యూట్యూబ్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైనం..
వీక్షకుల ఆదరణతోనే..
మేము ఇప్పటికే పాటను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశాం. అనుకున్నదానికంటే ఎక్కువగా స్పందన రావడం, పలువురు వీక్షకులు ప్రశంసలు అందించడం మాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. స్థానిక కళాకారులు, నటీనటులతోపాటు స్థానికంగానే చిత్రీకరించిన మా పాటకు ఇంతటి ఆదరణ లభించడం మరింత ఉత్సాహాన్నిస్తోంది. ప్రేక్షకుల ప్రశంసలు, ఆదరణే మాకు కొండంత బలం. – గొనుగొప్పుల రాజశేఖర్,
నృత్య దర్శకులు, నిర్మల్
నిర్మల్‌ఖిల్లా/ఖానాపూర్: నిర్మల్ జిల్లా కళలకు, కళాకారులకు పుట్టినిల్లు. బతుకమ్మ పండుగ స్థానిక సృజనాత్మకతకు, జానపద కళలకు కొత్త ఉత్సాహం నింపుతోంది. స్థానిక కళాకారులు, దర్శకులు రూపొందించిన పాటలు యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో విశేష ఆదరణ పొందుతున్నాయి. మన పాటలు తెలంగాణ అంతటా మార్మోగుతున్నాయి. నటీనటులు, దర్శకులు, కెమెరామెన్‌లంతా స్థానికులే. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే జానపద గీతాలతో వారు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి, ఆటపాటలతో సంబరాలు చేసుకునే వేళ.. స్థానిక కళాకారుల గళం నుంచి జాలువారుతున్న జానపద గీతాలు పండుగ సందడిని మరింత పెంచుతున్నాయి. ఆదివారం సద్దుల బతుకమ్మ సందర్భంగా ప్రత్యేక కథనం.
బతుకమ్మ కేవలం పూల పూజ కాదు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మమేకమైన జీవనశైలికి, తరతరాల సంప్రదాయాలకు ప్రతీక. నిర్మల్ కళాకారులు స్థానిక వాతావరణం, పల్లె అందాలు, సంప్రదాయ వస్త్రధారణ, ఆటపాటలను మేళవించి పాటలు తయారుచేస్తున్నారు. ఇవి వినోదంతోపాటు భావి తరాలకు సంస్కృతిని పరిచయం చేస్తున్నాయి.
యూట్యూబ్‌లో రాజశేఖర్ బృందం పాట
గొనుగుప్పుల రాజశేఖర్ దర్శకత్వంలో, కాండ్రే రామరాజు కెమెరాతో స్థాని కులు రూపొందించిన పాట యూట్యూబ్‌లో వేలాది వీక్షణలు సాధించింది. పెద్ద నిర్మాణ సంస్థల అండ లేకున్నా ప్రతిభ, ఆసక్తి, సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన పాటలు తయారుచేయవచ్చని ఇది నిరూపిస్తోంది.
మనోహర్ బృందం మరోపాట
మనుమనోహర్, కమలాకర్ తదితరుల నిర్మాణంలో మరో పాట వచ్చింది. ‘తుమ్మెదతుమ్మెద’ ప్రోమో ‘తెలుగు సినిమా ప్రపంచం’ చానెల్‌లో 30 వేలకు పైగా వ్యూలు సాధించింది. దసరాకు ముందు పూర్తి పాట విడుదల కానుంది.
సామాజిక మాధ్యమాలే వేదిక
యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రా మ్ వంటి వేదికలు స్థానిక కళాకారులకు ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను చేరు వ చేస్తున్నాయి. నిర్మల్ కళాకారులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు.
తెలుగు–మరాఠీ సమ్మేళనం..
ఖానాపూర్ మండలం రాజురా గ్రామంలో తెలుగు, మరాఠీ సమ్మేళనంతో జానపదపాట చిత్రీకరణ పూర్తయింది. ‘‘అల్లిన ఆడే మేదరన్న.. మూడు రంగుల ముత్యాల బుట్టే.. బుట్టబట్టి పూలకు పోతే కొమ్మ తగిలి కొంగు అడ్డమాయేం’’, ‘‘ముద్ద బంతి పూలు తెచ్చిండే’’ వంటి పంక్తులు గ్రామీణ సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. నిర్మాత కృష్ణ, రచయిత్రి–గాయని చిన్నమ్మ, కెమెరామెన్ వరుణ్ భట్టు, కొరియోగ్రాఫర్ జీవన్ మాస్టర్. జనగామకు చెందిన సౌందర్య కొత్త నటిగా పరిచయమవుతోంది. మిగతా వారంతా స్థానికులే. ప్రజల ఆదరణ, సాంస్కృతిక సంస్థలు, ప్రజాప్రతినిధుల సహకారం ఉంటే మరిన్ని నాణ్యమైన జానపద గీతాలు వెలుగులోకి వస్తాయి. బతుకమ్మ పాటల ద్వారా నిర్మల్ కళాకారులు స్థానిక ప్రతిభను చాటుతున్నారు. కళల ఖిల్లా నిర్మల్‌లో ఈ సందడి కొత్త వెలుగులు అద్దుతోంది.


