భైంసా మార్కెట్‌లో క్యాష్‌ కటింగ్‌! | - | Sakshi
Sakshi News home page

భైంసా మార్కెట్‌లో క్యాష్‌ కటింగ్‌!

Oct 14 2026 4:17 AM | Updated on Oct 14 2026 4:17 AM

రూ.వందకు రూ.1.50 అదనపు కమీషన్‌ ఏటా రూ.కోట్లలో అక్రమార్జన సరుకుల కొనుగోళ్లలో దళారుల తీరు చోద్యం చూస్తున్న ఏఎంసీ అధికారులు

భైంసాటౌన్‌: కష్టనష్టాలకోర్చి సాగుచేస్తున్న రైతన్నకు అండగా నిలవాల్సిన ఏఎంసీ అధికారులు చోద్యం చూస్తున్నారు. పట్టణంలోని ఏఎంసీ మార్కెట్‌లో వ్యాపారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే భైంసా వ్యవసాయ మార్కెట్‌ రెండో అతిపెద్దది. డివిజన్‌లోని ఆయా గ్రామాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయించేందుకు భైంసా మార్కెట్‌కు వస్తుంటారు. అయితే, ఇక్కడ మార్కెట్‌ కమిటీ నిబంధనల మేరకు వెయింగ్‌ చార్జీలు, హమాలీ, చాటావాల చార్జీలతోపాటు కమీషన్‌ ఫీజు మార్కెట్‌ కమిటీ వసూలు చేస్తుంది. కానీ, వ్యాపారులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా క్యాష్‌ కటింగ్‌ పేరిట రూ.వందకు అదనంగా రూ.1.50 కమీషన్‌ ఫీజు అధికంగా వసూలు చేస్తున్నారు. దీంతో రైతులు నష్టపోతున్నారు.

రూ.కోట్లలో లావాదేవీలు..

భైంసా మార్కెట్‌కు ప్రతీ ఖరీఫ్‌, రబీ సీజన్లలో సాగుచేసిన పంట ఉత్పత్తులు విక్రయానికి వస్తుంటాయి. ముఖ్యంగా సోయా, శనగలు, జొన్నలు, మక్కలు, నువ్వులు, ఇతర పంట ఉత్పత్తులను రైతులు ఇక్కడ విక్రయిస్తారు. ఒక్క సీజన్‌లోనే ఏఎంసీకి 1శాతం సెస్‌ రూపంలో రూ.40–రూ.50 లక్షల ఆదాయం సమకూరుతుంది. అంటే ఈ లెక్కన ఒక్కో సీజన్‌లో రూ.400–రూ.500 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతాయని స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే, ఇక్కడి వ్యాపారులు రైతుల నుంచి క్యాష్‌ కటింగ్‌ పేరిట కమీషన్‌ ఫీజు అధికంగా వసూలు చేస్తున్నారు. దీంతో ప్రతి సీజన్‌లో రూ.50–రూ.75 లక్షల వరకు రైతుల నుంచి అక్రమంగా ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలో ఇప్పటివరకు మార్కెట్‌లో రూ.18.43 కోట్ల సరుకు కొనుగోలు చేయగా, రూ.1.50 అదనపు కమీషన్‌ రూపంలో రైతులు రూ.27.65 లక్షల వరకు నష్టపోయినట్లు తేటతెల్లమవుతోంది.

పట్టించుకోని అధికారులు..

కొద్దిరోజులుగా ఈనామ్‌ సర్వర్‌ పనిచేయకపోవడంతో వ్యాపారులు బహిరంగ వేలం పద్ధతిలో సరుకులు కొనుగోలు చేస్తున్నారు. ఈ పద్ధతిలో వ్యాపారులకు ధర తెలిసిపోతుండడంతో, పోటీ తగ్గి ధర తక్కువగా వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కమీషన్‌ ఫీజు అదనంగా బహిరంగంగా వసూలు చేస్తున్నా సంబంధిత ఏఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఏఎంసీ ఉన్నతశ్రేణి కార్యదర్శి పూర్యానాయక్‌ను వివరణ కోరగా, రైతులు ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటామని చెప్పడం గమనార్హం. రైతులు వారి ఆర్థిక అవసరాలు, వ్యాపారులతో సత్సంబంధాలు, ఇతర బలహీనతల కారణంగా అధికారులకు ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నారు. కానీ, ఈ విషయం అధికారులకు తెలిసినా ఫిర్యాదు చేస్తేనే స్పందిస్తామనడం విమర్శలకు తావిస్తోంది.

భైంసా మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు ఇటీవల భైంసా వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సోయా విక్రయించాడు. 8.39 క్వింటాళ్లు అమ్మగా, క్వింటాలుకు రూ.5,864 ధర పలికింది. ఈ లెక్కన ఆయనకు రూ.49,198 చెల్లించాలి. ఇందులో వెయింగ్‌ చార్జీలు రూ.51, కమీషన్‌ ఫీజు రూ.వందకు రూ.1.50 చొప్పున రూ.738, చాటావాల చార్జీ రూ.42.50, హమాలీ చార్జీ రూ.266.90 మొత్తం రూ.1098 కటింగ్‌ పోను 48,100 వ్యాపారి రైతుకు చెల్లించాలి. కానీ, నిబంధనలకు విరుద్ధంగా క్యాప్‌ కటింగ్‌(నగదు చెల్లిస్తున్నందుకు) కమీషన్‌ ఏజెంట్‌ రూ.వందకు మరో రూ.1.50 అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో రైతుకు అసలు మొత్తం నుంచి మరో రూ.738 పోను చేతికి 47,363 మాత్రమే వచ్చింది. వాస్తవానికి రైతు సరుకు అమ్మిన వెంటనే, లేదా మరుసటి రోజు వ్యాపారి రైతుకు డబ్బులు చెల్లించాలి. కానీ, రైతుల అమాయకత్వం, నిరక్షరాస్యత, పేదరికం ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు నెలల తరబడి డబ్బులు చెల్లించకుండా, వెంటనే డబ్బులు కావాలంటే రూ.వందకు రూ.1.50 చొప్పున కోత పెడుతున్నారు. దీంతో ఆరుగాలం శ్రమించి సాగు చేసిన రైతన్నలు నిలువుదోపిడీకి గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement