బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, పుష్కరాల పనులు నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను మంగళవారం పరిశీలించారు. ముందుగా శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి నూతన ఆలయ నిర్మాణ పనులు పరిశీలించిన ఆయన, పనుల పురోగతిపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన వ్యర్థాలను జాగ్రత్తగా తొలగించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఆలయ నిర్మాణం గడువులోపు పూర్తయ్యేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు.
పుష్కర ఘాట్ల పరిశీలన..
అనంతరం గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా నిర్వహించారు. గోదావరి తీరంలోని పుష్కర ఘాట్లను స్వయంగా పరిశీలించిన ఆయన, దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. పుష్కరాల పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్‌అండ్‌బీ ఈఈ సుభాష్, నీటిపారుదల శాఖ ఈఈ అనిల్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, ఆలయ ఈవో అంజనాదేవి, తహసీల్దార్ పవన్ చంద్ర తదితరులు ఉన్నారు.


