నిర్మల్‌చైన్‌గేట్: ఎన్‌హెచ్‌ఎం (నేషనల్ హెల్త్ మిషన్) ఉద్యోగులు మంగళవారం నిరవధిక సమ్మె చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ హెల్త్ మిషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం ఉండదని స్పష్టం చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరినీ స్టేట్ హెల్త్ సొసైటీ లోనే కొనసాగిస్తూ స్పర్శ్ ద్వారా నేరుగా వేతనాలు చెల్లించాలన్నారు. 2022 నుంచి ప్రతీ సంవత్సరం 5 శాతం ఇంక్రిమెంట్, 8 శాతం రాయల్టీ బోనస్ మంజూరు చేయాలన్నారు. కమిషనర్ ఉత్తర్వుల మేరకు ప్రతీ నెల 5వ లోపు జీతాలు చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న 9 నెలల పీఆర్సీ, ఏరియర్స్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 180 రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలన్నారు. విధి నిర్వహణలో ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా/ఇన్సూరెన్స్ అందించి, కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వాలన్నారు.జీవో 60, 1195 ప్రకారం పెంచిన వేతనాలు చెల్లించాలన్నారు.


