యువతకు ఉపాధి భరోసా | - | Sakshi
Sakshi News home page

యువతకు ఉపాధి భరోసా

Oct 11 2026 11:43 PM | Updated on Oct 11 2026 11:43 PM

చదువుకున్నా.. కొలువు రాకపోతే.. ఇక వివరాలు ఇవ్వాల్సిందే 18–35 ఏళ్ల నిరుద్యోగులపై సర్కారు దృష్టి.. పంచాయతీ కార్యదర్శులతో దరఖాస్తుల స్వీకరణ..

భెంసా: చదువుకున్నా ఉద్యోగం దొరకక ఇంట్లోనే ఉంటున్న గ్రామీణ యువత భవిష్యత్‌కు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులను గుర్తించి వారి విద్యార్హతలు, నైపుణ్యాలు, ఆసక్తులు, ఉపాధి అవసరాలను నమోదు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఈ వివరాలు సేకరిస్తున్నారు. అనేక గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణతో పాటు ఆన్‌లైన్‌ నమోదు కూడా జరుగుతోంది.

పంచాయతీ కార్యదర్శులకు కీలక బాధ్యత

గ్రామ పరిధిలోని చదువుకున్న నిరుద్యోగ యువతను గుర్తించే బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. వారి పేరు, తల్లిదండ్రులు లేదా భర్త పేరు, లింగం, కులం, చిరునామా, జిల్లా, మండలం, గ్రామపంచాయతీ, గ్రామం, ఇంటి నంబర్‌ వంటి ప్రాథమిక వివరాలతో పాటు విద్యార్హతలు, నైపుణ్యాలు, ఉపాధి అవసరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. దీనివల్ల గ్రామాల వారీగా నిరుద్యోగ యువతపై సమగ్ర సమాచారం ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తుంది. సేకరించిన డేటా ఆధారంగా యువతకు ఏ రంగంలో శిక్షణ అవసరమో, ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలో, ఎవరికి స్వయం ఉపాధి పథకాలు ఉపయోగపడతాయో అనే అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది.

ఉద్యోగం, స్వయం ఉపాధికి అవకాశాలు

యువతను కేవలం ఉద్యోగాలకే పరిమితం చేయకుండా ఉపాధి కల్పన, మార్కెటింగ్‌, వివిధ ప్రభుత్వ పథకాలు, నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానికంగా అందుబాటులో ఉన్న అవకాశాలను గుర్తించి వాటికి అనుగుణంగా శిక్షణ అందించి, గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు తమ సొంత గ్రామంలోనే ఉపాధి లభించేలా కార్యాచరణ రూపొందించనున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత వివరాలను సేకరిస్తున్నాం. విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గ్రామాల వారీగా పంచాయతీ కార్యదర్శుల ద్వారా వివరాలు సేకరిస్తున్న నేపథ్యంలో అర్హులైన యువత తమ వివరాలను నమోదు చేసుకోవాలి. జాబ్‌ మేళాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు పొందాలి.

– విజయలక్ష్మి,

జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్‌

జాబ్‌ మేళాలతో ఉపాధి

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్‌ మేళాలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు సంస్థలు పాల్గొని ఖాళీలకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. 2025 జనవరి నుంచి 2026 సెప్టెంబర్‌ వరకు నిర్వహించిన జాబ్‌ మేళాల ద్వారా అనేకమందికి ఉద్యోగాలు లభించాయి.

జిల్లాలో 3,746 మంది నమోదు

జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసు లైవ్‌ రిజిస్టర్‌ ప్రకారం అక్టోబర్‌ 7 నాటికి 3,746 మంది ఉద్యోగార్థులుగా నమోదయ్యారు. వీరిలో 19 ఏళ్లలోపు వారు 133 మంది, 20–29 ఏళ్ల వారు 1,797 మంది, 30–39 ఏళ్ల వారు 1,816 మంది ఉన్నారు. విద్యార్హతల వారీగా పదో తరగతి ఉత్తీర్ణులు 1,052 మంది, ఇంటర్‌ 1,173 మంది, గ్రాడ్యుయేట్లు 931 మంది ఉన్నారు. పోస్టు గ్రాడ్యుయేట్లు, ప్రొఫెషనల్‌ కోర్సులు చదివిన వారు కూడా రిజిస్టర్‌లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement