భైంసా పట్టణంలో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఏటా ఎంగిలిపూల మరుసటి రోజే సద్దుల బతుకమ్మ నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. ఈ క్రమంలో మహిళలు, యువతులు ఉదయం నుంచే తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి అలంకరించారు. సాయంత్రం ఆయా కాలనీల నుంచి మహిళలు, యువతులు బతుకమ్మ పాటలకు కోలాటాలు, నృత్యాలతో బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్దకు చేరుకోగా, మున్నూరుకాపు మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ఎమ్మెల్యే రామారావుపటేల్, మున్సిపల్ చైర్మన్ తూముల దత్తాత్రి మహిళలు, యువతులతో కలిసి బతుకమ్మ పాటలకు నృత్యం చేశారు. రాత్రి పొద్దు పోయేవరకు మహిళలు బతుకమ్మ ఆడారు. అనంతరం ప్రాజెక్టు నీటిలో నిమజ్జనం చేశారు. సత్తుపిండి వాయినం ఇచ్చి పుచ్చుకున్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. – భైంసాటౌన్


