భైంసాటౌన్: జిల్లాలో మళ్లీ దొంగతనాలు కలవరపె డుతున్నాయి. భైంసా డివిజన్ పరిధిలో ఇటీవల ఒకేరోజులో 8 ఇళ్లలో చోరీలు జరగడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భైంసా మండలంతో పాటు పట్టణంలోని పలు ఇళ్లలో నుంచి బంగారం, వెండి, నగదుతోపాటు ఇతర వస్తువులు ఎత్తుకెళ్లిన విష యం తెలిసిందే. గతనెలలో జిల్లా కేంద్రంలో నూ చోరీలు జరిగిన సంగతి విదితమే. మళ్లీ భైంసా డివి జన్‌లో తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా పెద్ద ఎత్తున చోరులు దొంగతనానికి పాల్పడడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికే పలు కేసులను ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా భైంసా డివిజన్‌లో జరిగిన చోరీల ఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సోషల్ మీడియాతో జాగ్రత్త..
ఇటీవలి కాలంలో చాలామందికి సోషల్‌మీడియా పిచ్చి పెరిగిపోయింది. ఎక్కడికెళ్లినా, ఏ సందర్భమైనా వెంటనే సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా ఊరికి వెళ్లి నప్పుడు ఆ సమాచారాన్ని, ఫొటోలను వెంటనే సో షల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో కొందరికి మీరు ఇంట్లో లేరన్న విషయం మీరే తెలియజేసినట్లు అవుతుంది. అంతేగాక, ప్రయాణానికి సిద్ధమయ్యే తొందరలో తాళాలు వేయడం మరిచిపోకుండా, అన్ని భద్రతా ఏర్పాట్లు పక్కాగా చూసుకుని ప్రశాంతంగా మీ పండుగను, ట్రిప్‌ను జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
భైంసా సబ్ డివిజన్ పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి దాదాపు అన్ని కేసుల్లో నిందితులను గుర్తించాం. రెండు నెలలుగా ఎలాంటి చోరీలు జరగలేదు. తాజాగా 8 ఇళ్లలో జరిగిన దొంగతనానికి సంబంధించి కూడా ఆధారాలు సేకరించాం. నిందితులను గుర్తించే పనిలో ఉన్నాం. ప్రస్తుతం పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లకు తలుపులు, కిటికిలు మూసివేసి తాళాలు వేసుకోవాలి. ఇళ్లలో విలువైన బంగారం, వెండి వస్తువులు, పెద్దమొత్తంలో నగదును ఉంచకుండా సురక్షిత ప్రదేశంలో భద్రపర్చుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – సాయికుమార్, ఏఎస్పీ, భైంసా


