మూడేళ్లుగా పెరుగుతున్న విస్తీర్ణం బోనస్ పథకంతో రైతుల ఆసక్తి జిల్లాలో గతేడాదిలో వానాకాలంలో సన్నాలు ..85 వేల ఎకారల్లో సాగు ప్రస్తుతం సన్నాలు..1లక్ష13వేల350 వేల ఎకారల్లో వరి సాగు
లోకేశ్వరం : జిల్లా రైతులు సన్నాల సాగుకు సై అంటున్నారు. ఇంతకాలం దొడ్డు, సన్న రకాలకు ఒకే ధర ఉండటంతో గిట్టుబాటు కాదని భావించిన రైతులు బోనస్ పథకం అమలుతో సన్నాలపై ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకం తీసుకురావడంతో మరింత ధీమా కలిగింది. ప్రస్తుత వానాకాలంలో జిల్లాలో వరి సాగులో 80 శాతం మంది సన్నాలే సాగు చేశారు.
జిల్లాలో విస్తీర్ణం పెరుగుదల
2025–26 వానాకాలంలో 85 వేల ఎకరాల్లో సన్నాలు సాగు చేశారు. ప్రస్తుత వానాకాలంలో 1,13,350 ఎకరాలకు పెరిగింది. గతంలో అనేక నియోజకవర్గాల్లో సన్నాల సాగు కనిపించని పరిస్థితి ఉండేది. ఇప్పుడు రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా సన్నాల వైపు మొగ్గు చూపుతున్నారు.
బోనస్‌తో లాభం
ప్రభుత్వం కనీస మద్దతు ధరపై క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. కేంద్రం నిర్ణయించిన రూ.2,389కు కలపడంతో రూ.2,889కు చేరింది. బహిరంగ మార్కెట్ ధరలు కూడా పెరిగాయి. వానాకాలంలో ఏడు రకాలు.. తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్ 15048), సాంబ మసూరి (బీపీటీ 5204), కేఎన్‌ఎం 1638, హెచ్‌ఎంటీ సోనా, జైశ్రీరాం, వరంగల్ సిద్ది 44, కేఎన్‌ఎం 7715 సాగు చేయాలని సూచించింది. 17 శాతం తేమ శాతం తప్పనిసరి కావడంతో రైతులకు కొంత నష్టం ఉంటుందని, మాయిశ్చర్‌పై మినహాయింపులు కావాలని కోరుతున్నారు.
విస్తీర్ణం పెరుగుతోంది
సన్నాల సాగువిస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ప్రభుత్వం రూ.500 బోనస్ ఇవ్వడం, పౌర సరఫరాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండడం ప్రభుత్వ ప్రోత్సాహం, వ్యవసాయ అధికారుల ప్రచారంతో సన్నాల సాగు పెరిగింది. చీడ పీడల సమస్య ఉంటే వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. మంచి దిగుబడులు సాధించాలి.
– సుజాత, ఏడీఏ


