మంచిర్యాలఅర్బన్: దసరా పండుగను పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. రోజువారీగా నడిచే సాధారణ బస్సులతో పాటు పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. ఈనెల 10నుంచి 22వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించటంతో స్వగ్రామాలకు వెళ్లేవారి సంఖ్య పెరగనుంది. హైదరాబాద్‌లో ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల నిమిత్తం ఉంటున్నవారంతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సొంతూళ్ల బాటపట్టనున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను నివారించేందుకు రీజియన్ వారీగా అధికారులు 533 బస్సులు నడిపించనున్నారు.
ప్రత్యేక బస్సులు ఇలా..
ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, భైంసా, ఆసిఫాబాద్, ఉట్నూర్ డిపోల నుంచి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. మంచిర్యాల నుంచి 154, నిర్మల్ నుంచి 144, ఆదిలాబాద్ నుంచి 130, ఆసిఫాబాద్ నుంచి 62, భైంసా నుంచి 31, ఉట్నూర్ నుంచి 31 సర్వీసులను నడిపించనున్నారు. అత్యధికంగా అక్టోబర్ 17న 101 బస్సులు, 18న 73, అక్టోబర్ 16న 54 బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. ప్రయాణికులకు బస్సుల సమాచారం ఎప్పటికప్పుడు అందించేందుకు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు.
ప్రత్యేక బస్సుల్లోనే
అదనపు చార్జీలు
రోజువారీగా నడిచే బస్సుల్లో సాధారణ చార్జీలు అమలులో ఉండగా, పండుగ రద్దీ కోసం కేటాయించిన ప్రత్యేక బస్సుల్లో మాత్రం సాధారణ ధర కంటే చార్జీలు అదనంగా వసూలు చేయనున్నారు. ప్రత్యేక బస్సులు మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు ఖాళీగా (ఒకే వైపు ప్రయాణికులతో) వెళ్లి మంచిర్యాలకు తిరిగి వస్తుండటంతో వచ్చే అదనపు నిర్వహణ ఖర్చులను భర్తీ చేసేందుకు 50శాతం అదనపు చార్జీలు విధిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
డిపోలు, తేదీల వారీగా ప్రత్యేక బస్సుల వివరాలు
తేదీ ఆదిలాబాద్ భైంసా నిర్మల్ ఉట్నూర్ ఆసిఫాబాద్ మంచిర్యాల
09 15 01 18 02 06 18
10 08 02 09 01 05 10
11 06 02 06 0 02 05
12 06 02 06 0 04 08
13 07 03 05 01 02 07
14 07 03 05 01 02 07
15 06 03 05 01 02 06
16 12 03 16 01 08 15
17 27 03 29 01 08 33
18 18 04 19 02 10 20
19 08 02 12 01 05 10
20 10 03 15 01 08 15


