ఖానాపూర్: పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర కళాశాల విద్యార్థులు పీఈటీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నచిన్న విషయాలకే తమను కొడుతున్నాడని ఆరోపిస్తూ ఎన్టీఆర్ చౌరస్తాలో బుధవారం రాస్తారోకో చేపట్టారు. పీఈటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. పీఈటీ తమపై దాడి చేశారన్న ఆరోపణలపై వివరాలు సేకరించారు. అనంతరం విద్యార్థులు ఆందోళన విరమించి కళాశాలకు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులను పీఈటీ కొట్టారన్న ఆరోపణలపై విచారణ చేస్తున్నామని తెలిపారు. విచారణ అనంతరం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాఠశాల, కళాశాలకు కలిపి ప్రస్తుతం ఒక్కరే పీఈటీ ఉన్నారని, అదనంగా పీడీని నియమించాలని ఇప్పటికే ఉన్నతాధికారులను కోరినట్లు వెల్లడించారు.


