లక్ష్మణచాంద: దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు వ్యవసాయంలో ఎన్ని నష్టాలు ఎదురైనా అధైర్యపడకుండా, ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి పంటలు పండిస్తారు. భూమాతను నమ్ముకుని మళ్లీ పంటలు పండిస్తారు. ఈ ఏడాది ఎల్‌నినోకు ఎదురొడ్డుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు ముఖం చాటేశాడు. జూలైలో వర్షాలు ఆశాజనకంగా కురవడంతో రైతులు వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి వంటి పంటలను సాగు చేశారు. అయితే తర్వాత భారీ వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి.
తడారుతున్న వరి..
జిల్లాలో సరైన వర్షాలు కురవడం లేదు. రైతులు సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి పంటలకు నీరు అందక అవి ఎండిపోతున్నాయి. ముఖ్యంగా వరి వేసిన రైతులు పంట తడి కోసం కంటతడి పెడుతున్నారు. వారం రోజులుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వరి పైర్లలో తడారుతోంది. కళ్లముందే పంటలు ఎండిపోతుంటే రైతుల కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.
సంక్షోభంలో 16 వేల ఎకరాలు..
సరస్వతి కాలువ కింద 16 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రధానంగా నిర్మల్ రూర ల్, సోన్, లక్ష్మణచాంద మండలాల రైతులు ఈ ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నా రు. బోరు బావులు ఉన్న రైతులు తమ పంటలకు నీరు అందిస్తూ కాపాడుకుంటున్నారు. అయితే కాలువపై ఆధారపడిన రైతులు నీరు రాకపోవడంతో మరో రెండు రోజులు ఎండలు కొనసాగితే వరి, మొక్కజొన్న, సోయా పంటలు సుమారు 4,000 ఎకరాల్లో ఎండిపోతాయని ఆందోళన చెందుతున్నారు.
లీకేజీ నీరు వాగులోకి..
వర్షాలు లేక ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో స రస్వతీ కాలువ లీకేజీ ద్వారా కొంత నీరు వస్తోంది. ముఠాపూర్–న్యూ వెల్మల్ సమీపంలో కాలువ కింద నుంచి ముఠాపూర్ వాగు ప్రవహిస్తుంది. కాలువ స్లాబ్‌కు గండ్లు పడటంతోపాటు చెత్త, ప్లాస్టిక్ బాటి ళ్లు అడ్డుగా ఉండటం లీకేజీ నీరు వాగులోకే వెళుతోంది. కిందకు చుక్క నీరు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.


