నోటీసులకు నో రెస్పాన్స్‌! | - | Sakshi
Sakshi News home page

నోటీసులకు నో రెస్పాన్స్‌!

Sep 8 2026 12:47 AM | Updated on Sep 8 2026 12:47 AM

చిన్న పొరపాట్లకూ నోటీసులపై

ఓటర్ల పెదవి విరుపు

గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కరువు

ఎలా సమాధానం చెప్పాలో తెలియక అయోమయం

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో ఇటు ఓటర్లకు, అటు బీఎల్‌వోలకు విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నా యి. కుటుంబ సభ్యుల మధ్య వయసు తేడాలు, పేర్లలో మార్పులు, కుటుంబ సంబంధాల నమోదులో తేడాలు, పుట్టిన తేదీల్లో వ్యత్యాసాలు ప్రజలకు కొత్త చిక్కులు తెస్తున్నాయి. భార్యాభర్తల మధ్య వయసు తేడా తొమ్మిది నెలల కంటే తక్కువగా ఉంటే అదనపు పరిశీలన చేయాల్సిన కేసుగా పరిగణిస్తున్నారు. తల్లిదండ్రులు–పిల్లల మధ్య వయస్సు తేడా 15 ఏళ్ల కంటే తక్కువగా లేదా 50 ఏళ్లకుపైగా ఉన్నా సంబంధిత ఆధారాలు సమర్పించాలని సూచిస్తున్నారు. ఒకే రకమైన పేరును తండ్రి పేరు పేర్కొంటే వాటిని సరిచేసుకోవాల్సిందేనని నోటీసులు జారీ చేస్తున్నారు. ఇలాంటి కారణాలతో నోటీసులు ఇవ్వడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తార్కిక వ్యత్యాసాలు ఉంటే అదనపు ధ్రువపత్రాలు సమర్పించి సరిచేసుకోవాల్సిన బాధ్యత ఓటర్లదేనని అధికారులు పేర్కొంటున్నారు. ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది.

కొనసా..గుతున్న నోటీసుల జారీ

జిల్లాలో సర్‌ నోటీసుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 2,22,003 మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1,64,050 మందికి ఇచ్చారు. ఇంకా 57,953 మందికి నోటీసులు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం 16,308 మంది మాత్రమే హియరింగ్‌కు హాజరై తమ ఆధారాలను చూపించారు. అయితే నోటీసుల డౌన్‌లోడ్‌, ప్రింటింగ్‌ ఆలస్యం కావడం, పంపిణీకి ఎక్కువ సమయం తీసుకోవడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. చిన్నచిన్న తప్పులకే నోటీసులు వస్తుండడంతో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. అక్షర దోషాలు ఉన్నా అనామలీస్‌ జాబితాలో చేరాయి. నోటీసులు అందుకున్నవారు తమకు కేటాయించిన రోజున ఏదైనా పని ఉంటే ఆ రోజు వెళ్లలేకపోతున్నారు.

హియరింగ్‌కు రాకపోతే..

ఎస్‌ఐఆర్‌ నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 16వ తేదీ వరకు మాత్రమే గడువు మిగిలి ఉంది. ఈ క్రమంలో బీఎ ల్‌వోల ద్వారా నోటీసుల జారీలో జాప్యంతోపాటు హియరింగ్‌కు ఓటర్లు హాజరుకాకపోవడంతో మరోసారి రీషెడ్యూల్‌ చేయాల్సి వస్తోంది. సోమవారం నాటికి 147 మందికి రీషెడ్యూల్‌ చేశారు.

పూర్తి భారం బీఎల్‌వోలపైనే

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ సమయంలో బీఎల్‌వోలతో పాటు ప్రభుత్వంలోని ఇతర అధికారులు, సిబ్బందిని వినియోగించారు. కానీ నోటీసుల జారీ ప్రక్రియను మాత్రం బీఎల్‌వోలకే వదిలేయడంతో ఆలస్యం అవుతోంది. యాప్‌లో నోటీసుతో పాటు ఓటరు సమర్పించే పత్రాలు, హియరింగ్‌కు హాజరైన ఓటరు ఫొటోలను మూడు విడతలుగా బీఎల్‌వోలే అప్‌లోడ్‌ చేయాల్సి వస్తోంది. పదేపదే నిబంధనలు మారుతుండటం, నోటీసులు వచ్చిన ఓటర్లు ఎన్ని ధ్రువపత్రాలు సమర్పించాలన్న విషయంలో ఓటర్లతో పాటు బీఎల్‌వోల్లోనూ గందరగోళం నెలకొంది.

హియరింగ్‌కు పిలుస్తున్న బీఎల్‌వోలు

సమాధానం ఎలా ఇవ్వాలో తెలియక..

ఎస్‌ఐఆర్‌ సంబంధించి ఎన్యుమరేషన్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టిన జిల్లా అధికారులు నోటీసులు జారీ తర్వాత అంతగా పట్టించుకోవడం లేదు. చాలామందికి అక్షర దోషాలు, వయసు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాల్లో పొరపాట్లు వంటి చిన్న చిన్న కారణాలతో నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. వాటిని ఎలా సరిచేయాలి, ఏయే పత్రాలు సమర్పించాలన్నదానిపై ఓటర్లకు స్పష్టత లేదు. అధికారులు సైతం అవగాహన కల్పించడం లేదు. ఈ నేపథ్యంలో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. ప్రధానంగా నోటీసులు ఎందుకు ఇస్తున్నారు, ఓటర్లు ఏం చేయాలి, ఏయే పత్రాలు సమర్పించాలి, విచారణకు ఎక్కడికి హాజ రు కావాలనే విషయం కూడా చాలామందికి తెలి యని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లోని చాలామంది ఓటర్లు మరింత అభద్రతా భావంతో ఉన్నారు. వీరందరికీ అవగాహన కల్పించడంతోపాటు నోటీసులను సకాలంలో అందించి, సరైన ఆధారాలు సమర్పించేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

జిల్లాలో సోమవారం నాటికి జారీ చేసిన నోటీసులు..

జిల్లాలో మొత్తం పోలింగ్‌ కేంద్రాలు 930

మొత్తం జారీ చేయాల్సిన నోటీసులు 2,22,054

జనరేట్‌ చేసిన నోటీసులు 2,22,003

పంపిణీ చేసిన నోటీసులు 1,64,050

పంపిణీ చేయాల్సిన నోటీసులు 57,953

హియరింగ్‌ ప్రక్రియ పూర్తయిన వారు 16,308

హియరింగ్‌ గడువు ముగిసిన వారు 88,504

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement