లక్ష్మణచాంద: చదువుకునే బాలికలకు నెలసరిపైన సరైన అవగాహన లేకపోవడంతో వ్యక్తిగత పరిశుభత్ర పాటించక అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో నెలసరి సమయంలో బాలికలు తీసుకునే జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రతపై బాలికలకు మహిళా ఉపాధ్యాయులతో లేదా, గైనకాలజిస్టుతో అవగాహన కల్పించాలి. గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు ఎక్కువ మంది పేద కుటుంబాలకు చెందిన వారే. అవగాహన లేక వీరు సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు.
పీఎంశ్రీ పాఠశాలలో...
జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల్లోని బాలికల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. బాలికలకు నెలసరి సమయంలో ప్రభుత్వం ద్వారా న్యాప్‌కిన్లను పంపిణీ చేస్తుంది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా వసతులు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పాఠశాలలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తుంది. నాణ్యమైన బోధనతోపాటు, నృత్యం, కంప్యూటర్, చిత్రలేఖనం, సంగీతం నేర్పించేందుకు ప్రత్యేకంగా ఇన్‌స్ట్రక్టర్లను కూడా నియమించింది. ఏటా ప్రత్యేకంగా ఎడ్యుకేషనల్ టూర్‌కు విద్యార్థులను తీసుకెళ్లుతున్నారు.
పేద పిల్లలు...
ప్రభుత్వ పాఠఽశాలలో చదివేవారిలో ఎక్కువ మంది బాలికలు నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. పల్లె ప్రాంతాల్లో కుటుంబ ఆర్థిక సమస్యలు, నిరక్షరాస్యత, సరైన అవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది బాలికలు నెలసరి సమయంలో న్యాప్‌కిన్లను వినియోగించడం లేదు. ఈ కారణంగా అనారోగ్య సమస్యలబారిన పడుతున్నారు. బాలికలు ఆరోగ్యంగా ఉంటేనే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని బాలికల కుటుంబాలకు ఆర్థిక భారం తప్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం బాలికలకు న్యాప్‌కిన్లను అందచేస్తుంది.
జిల్లాకు రూ.10,63,300 నిధులు...
జిల్లాలో మొత్తం 19 పీఎంశ్రీ పాఠశాలలు ఉండగా ఇందులో 16 పాఠశాలల్లోని బాలికలకు అవసరమైన న్యాప్‌కిన్లు అందచేసేందుకు ప్రభుత్వం రూ.10,63,300 మంజూరు చేసింది. న్యాప్‌కిన్లు సరఫరా చేసేందుకు ఇటీవలనే టెండర్లు పిలిచామని త్వరలోనే సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు.
త్వరలో అందించేలా చర్యలు
జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల బాలికలకు న్యాప్‌కిన్లను అందచేసేందుకు టెండర్లు పిలిచాం. ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేసి న్యాప్‌కిన్లు త్వరగా బాలికలకు అందచేసేందుకు చర్యలు తీసుకుంటాం. విద్యార్థినులకు ఇబ్బంది కలుగకుండా చూస్తాం. – భోజన్న, డీఈవో
జిల్లా సమాచారం...
జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలలు 19
బాలికలు ఉన్న పాఠశాలలు 16
వచ్చిన మొత్తం నిధులు రూ.10,63,300


