నిర్మల్‌చైన్‌గేట్: రానున్న వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. సమావేశ మందిరంలో ఎస్పీ జానకీషర్మిలతో కలిసి ఉత్సవాల నిర్వహణపై సోమవారం పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని మతాల పండుగలు సోదర భావంతో, కలిసి మెలసి జరుపుకోవాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గణేశ్ ఉత్సవాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా వైర్లు సరి చేస్తామని చెప్పారు. ఉత్సవ నిర్వాహకులు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
శాంతియుతంగా జరుపుకునేలా చర్యలు
ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ జిల్లాలో గణేశ్ ఉత్సవాలు మొత్తం ప్రశాంతంగా పూర్తయ్యేలా పోలీసు శాఖ తరఫున తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వేడుకలకు తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినాయక ఉత్సవాలు పకడ్బందీగా నిర్వహించేలా చూస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, డీఎస్పీ శ్రీనివాస్, ఆర్డీవో దేవీదాస్, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


