ఖానాపూర్: పట్టణంలోని కుమురంభీమ్ చౌరస్తా సమీపంలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై సమగ్ర విచా రణ చేపట్టి అనర్హులను తొలగించాలని, అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు కలెక్టర్ భవేశ్‌మిశ్రాకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేశ్, ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి అల్లెపు పీటర్, బహుజన కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి పసుపుల వెంకన్న మాట్లాడుతూ.. గత ప్రభు త్వ హయాంలో భూమి, ఇల్లు లేని పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులను నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక చేశారని ఆరో పించారు. పొరపాట్లు సరిదిద్ది అర్హులైన నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారుల జాబితాను పూర్తిస్థాయిలో పరిశీలించి సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరారు. మున్సిపాలిటీలో డబుల్ బెడ్‌రూం ఇళ్లకు సంబంధించిన ప్రస్తుత ఆన్‌లైన్ ప్రక్రియను రద్దు చేసి, అనర్హులను తొలగించిన అనంతరం అర్హుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంసీపీఐయూ జిల్లా సహాయ కార్యదర్శి భూక్య సురేందర్, ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం లింగన్న, డబుల్ బెడ్‌రూం సాధన కమిటీ కన్వీనర్ తోట రాధ, కోకన్వీనర్ షేక్‌గౌస్, మజ్జిత్, కల్పన, లక్ష్మి, గంగోత్రి, సునీత, షరీన్ పాల్గొన్నారు.


