అక్రమ నిర్మాణాల జోరు | - | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాల జోరు

Sep 7 2026 7:21 AM | Updated on Sep 7 2026 7:21 AM

● యథేచ్ఛగా దారులు, నాలాల ఆక్రమణ ● మున్సిపల్‌ అదాయానికి గండి ● నోటీసులకే పరిమితమవుతున్న అధికారులు

ఖానాపూర్‌: పట్టణంలో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. నిబంధనల ప్రకారం మున్సిపల్‌ అనుమతులు పొందిన తర్వాతే ఇళ్లు, వాణిజ్య భవనాల నిర్మాణాలు చేపట్టాలి. కానీ కొందరు నిబంధనలను తుంగలో తొక్కి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. రోడ్లు, నాలాలను సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకునేవారు లేరు. అనుమతులు లేని నిర్మాణాలతో బల్దియా ఆదాయానికి గండి పడుతోంది.

అనుమతులు లేకుండానే..

ఖానాపూర్‌ పట్టణంలోని 12 వార్డుల పరిధిలో నిర్మాణాలకు టీఎస్‌–బీపాస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది టీఎస్‌–బీపాస్‌ సక్రమంగా పనిచేయకపోవడంతో సమస్యలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టణంలో సుమారు 100 నిర్మాణాలు చేపడితే, వాటిలో 30కి పైగా నిర్మాణాలకు అనుమతులు లేవు. స్థానికుల నుంచి ఫిర్యాదులు అందినప్పుడు మున్సిపల్‌ అధికారులు వెళ్లి నోటీసులు జారీ చేసి పనులను నిలిపివేస్తున్నారు. కొందరు పనులు నిలిపిన తర్వాతే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, స్థానిక అధికారుల నిర్లక్ష్యం మున్సిపల్‌ ఆదాయానికి గండి కొడుతోంది.

నిబంధనలు లేకుండా..

ఖానాపూర్‌ ప్రధాన రహదారితోపాటు అంతర్గత గల్లీల్లోనూ ఇటీవల వాణిజ్య, గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి. రహదారి మధ్య నుంచి నిబంధనల ప్రకారం నిర్దేశిత స్థలం(సెట్‌బ్యాక్‌) వదిలి నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నా, కొందరు ఈ నిబంధనలను పట్టించుకోవడం లేదు. ప్రధాన రహదారికి, అంతర్గత రహదారులకు అవసరమైన స్థలం వదలకుండా నిర్మాణాలు చేపట్టడంతో ప్రధాన రోడ్లు, గల్లీలు క్రమంగా ఇరుకుగా మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నాలాలపై స్లాబులు, ర్యాంపులు

ఖానాపూర్‌ పట్టణంలోని నాలాలపై స్లాబులు, మెట్లు నిర్మించి ఆక్రమిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మార్కెట్‌ ప్రాంతాల్లోనూ నిర్మాణాలు చేపట్టి స్థలాలను వినియోగించుకుంటున్నారని చెబుతున్నారు. దీంతో డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగును తొలగించేందుకు అవకాశం లేకుండా పోతోంది. వర్షాకాలంలో మురుగు రోడ్డుపైకి చేరుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిబందనలు

పాటించకుంటే చర్యలు..

ఖానాపూర్‌ పట్టణంలో మున్సిపల్‌ నిబంధనలు, భవన నిర్మాణ అనుమతులు, ఇతర నిబంధనలపై ప్రజలు, భవన నిర్మాణదారులకు అవగాహన కల్పిస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన పలువురికి నోటీసులు జారీచేశాం. మార్పు రాకపోతే చర్యలు తీసుకుంటాం. అనుమతులు పొందిన తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలి. – మనీష్‌, మున్సిపల్‌

భవన నిర్మాణ ఇన్‌స్పెక్టర్‌, ఖానాపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement