ప్లాస్టిక్‌పై పల్లెల యుద్ధం | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌పై పల్లెల యుద్ధం

Sep 6 2026 1:31 AM | Updated on Sep 6 2026 1:31 AM

● ‘సింగిల్‌యూజ్‌’పై ఇప్పటికే నిషేధం ● గ్రామాల్లో స్టీల్‌బ్యాంకుల ఏర్పాటు ● పెరిగిన చేతిసంచుల వాడకం

నిర్మల్‌: ప్లాస్టిక్‌ పర్యావరణానికి పెను ముప్పుగా మారుతోంది. భూతాపం పెరుగడానికి కాలుష్యమే కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా కాలుష్య నియంత్రణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రించేందుకు ఎన్ని నిబంధనలు తీసుకొచ్చినా.. క్షేత్రస్థాయిలో వాటి అమలులో లోపాలు ఉంటున్నాయి. మార్కెట్లు, కిరాణా దుకాణాలు, హోటళ్లు, చిరువ్యాపార కేంద్రాల్లో ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం విపరీతంగా కొనసాగుతోంది. ప్లాస్టిక్‌ లేయర్‌ ఉన్న పేపర్‌ ప్లేట్లు, టీ గ్లాసులు, టిఫిన్‌ ప్లేట్లను ఉపయోగించడం వల్ల క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో పర్యావరణానికి పెనుముప్పుగా మారుతున్న ప్లాస్టిక్‌తో మున్ముందు ఇంకెన్ని అనర్థాలు చూడాల్సి వస్తుందోనన్న ఆందోళన పల్లెల్లో పెరుగుతోంది. అదే గ్రామీణుల్లో చైతన్యాన్ని తీసుకొస్తోంది. ‘ప్లాస్టిక్‌పై ఇక పోరాడాల్సిందే..’ అన్న తరహాలో ఒక్కో గ్రామం ‘ప్లాస్టిక్‌ రహిత పల్లె’గా మారేదిశగా ప్రయత్నాలు ప్రారంభించి భేష్‌ అనిపించుకుంటున్నాయి.

ఉద్యమంలా..

ప్లాస్టిక్‌, పాలిథిన్‌ కవర్లతో కలిగే అనర్థాలపై పెరుగుతున్న అవగాహన పల్లెలను కదిలిస్తోంది. ఇప్పటికే చాలా గ్రామాలు ఉద్యమంలా ముందుకు వస్తున్నాయి. జిల్లాలో ఒక గ్రామాన్ని చూసి, మరో గ్రామం ప్లాస్టిక్‌ రహితం దిశగా అడుగులు వేస్తుండటం శుభపరిణామం. చేతిసంచులు పంచుతూ, స్టీల్‌బ్యాంకులు ఏర్పాటు చేసుకుంటూ, మాంసాహారాన్ని స్టీల్‌డబ్బాల్లోనే తీసుకెళ్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నాయి.

కుంటాలలో...

కుంటాల: పర్యావరణ పరిరక్షణ కోసం కుంటాల సర్పంచ్‌ జక్కుల గజేందర్‌, కార్యదర్శి రాజబాపు ఆధ్వర్యంలో ఆగస్టు 15 నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం అమలు చేస్తున్నారు. వారసంతలో వ్యాపారులు, వినియోగదారులు ప్లాస్టిక్‌ కవర్లను నిషేధిస్తూ ప్రతిజ్ఞ చేశా రు. చికెన్‌, మాంసం కోసం వచ్చేవినియోగదారులు డబ్బాలను వినియోగిస్తున్నారు. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా స్టీల్‌బ్యాంక్‌ కోసం దాతలు రూ.1.20 లక్షలు విరాళంగా ఇవ్వగా, 2,500 ప్లేట్లు, 100 గ్లాసులను కొనుగోలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement