ఖనాపూర్/నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజుల పూర్తయిన సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖానాపూర్ నుంచి నిర్మల్ వరకు డీసీసీ చీఫ్ వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నా రు. కేసీఆర్ రాజీనామా చేయాలని నినాదాలు చేశా రు. వెయ్యి రోజుల్లో ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాని కేసీఆర్‌కు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదన్నారు. నిర్మల్‌లో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కుచాడి శ్రీహరిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఖానాపూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు మాట్లాడారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి, పేదల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. 2028 ఎన్నికల్లో తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారాన్ని కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి నారాయణరావు పటేల్, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


