రూ.150 కోసం చదువు ఆపేసి.. | - | Sakshi
Sakshi News home page

రూ.150 కోసం చదువు ఆపేసి..

Sep 5 2026 6:37 AM | Updated on Sep 5 2026 6:37 AM

8లోu

ఆచూకీలేని ఆధ్యాత్మిక కారిడార్‌

బాసర.. ప్రకృతి అందాల సహస్రకుండ్‌.. రేణుకామాత, దత్తాత్రేయ క్షేత్రాలతో ప్రసిద్ధి చెందిన మాహోర్‌.. ప్రాంతాలను కలుపుతూ ఆధ్యాత్మిక– పర్యాటక కారిడార్‌ పత్తా లేదు.

మాతృ దేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్య దేవోభవం.. తల్లిదండ్రుల తర్వాత గురువుకు మన సంస్కృతి గొప్ప స్థానం ఉంది. గురువు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర.. అంటూ దైవస్థానం ఉంది. గురువు దారి చూపే మార్గదర్శి.. మనలోని అజ్ఞానాన్ని, అంధకారాన్ని తొలగించి సన్మార్గంలో నడిపించేది గురువే. కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, ఆత్మసాక్షాత్కారాన్ని, దివ్యత్వాన్ని పరిచయం చేసేది గురువే. నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బడిలో భావి భారతాన్ని తీర్చిదిద్దుతున్న జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులపై ప్రత్యేక కథనం.

ఖానాపూర్‌: గణితం కష్టమైన సబ్జెక్ట్‌ అనే భావనను తొలగిస్తూ, సాంకేతికతను జోడించి విద్యార్థుల్లో ఆసక్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారు పీఎంశ్రీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మస్కాపూర్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌ పనిచేస్తున్న సయ్యద్‌ ఫరాజ్‌ అబ్దుల్‌ కరీమ్‌. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చే విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి, వారికి మెరుగైన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన వినూత్న పద్ధతుల్లో బోధిస్తున్నారు. గణితాన్ని కేవలం పాఠ్యపుస్తకాల్లోని సూత్రాలు, లెక్కలకే పరిమితం చేయకుండా దైనందిన జీవితానికి అనుసంధానం చేస్తూ ఆచరణాత్మకంగా అర్థమయ్యేలా చేస్తున్నారు.

సాంకేతికతతో సులభమైన గణితం

జియోజిబ్రా, డిజిటల్‌ వనరులు, పైథాన్‌, ఆర్డునో వంటి సాంకేతిక సాధనాలను బోధనలో వినియోగిస్తూ క్లిష్టమైన గణిత అంశాలను విద్యార్థులకు సులభంగా వివరిస్తున్నారు. విద్యార్థులు కేవలం సమాధానాన్ని గుర్తుపెట్టుకోవడం కాకుండా, సమస్యను ఎలా పరిష్కరించాలి, దాని వెనుక ఉన్న కారణం ఏమిటి అనే విషయాలను అర్థం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ‘ఏమి నేర్చుకోవాలి?’ అనే ప్రశ్నతో పాటు ‘ఎందుకు నేర్చుకోవాలి?’ అనే ఆలోచన విద్యార్థుల్లో కలగాలన్నదే ఆయన బోధనా విధానం. ప్రశ్నించడం, పరిశీలించడం, స్వయంగా పరిష్కారాలను అన్వేషించడం ద్వారా విద్యార్థుల్లో స్వతంత్ర అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందిస్తున్నారు.

వినూత్న బోధనకు అవార్డు

తన ప్రత్యేకమైన బోధనా విధానానికి గుర్తింపుగా సయ్యద్‌ ఫరాజ్‌ అబ్దుల్‌ కరీమ్‌ ‘బెస్ట్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ టీచింగ్‌ అవార్డు’ అందుకున్నారు. బోధనా రంగంలో ఆయన ప్రతిభకు మరో గుర్తింపుగా ‘స్టేట్‌ రిసోర్స్‌ పర్సన్‌ ఫర్‌ డిజిటల్‌ లెర్నింగ్‌’గా సేవలందిస్తున్నారు. డిజిటల్‌ అభ్యసనానికి సంబంధించిన వనరులు, బోధనా పద్ధతులపై ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం అందిస్తున్నారు. విద్యార్థుల్లో ఆసక్తి, ఆత్మవిశ్వాసం పెంచడంతోపాటు స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఫరాజ్‌ అబ్దుల్‌ కరీమ్‌ చెబుతున్నారు

ఖానాపూర్‌: ఒకప్పుడు రూ.150 పరీక్ష ఫీజు చెల్లించలేక ఇంటర్‌ చదువు ఆపేసి భవన నిర్మాణ కార్మి కుడిగా పనిచేశారు. అయినా చదువుపై మక్కువ వదలకుండా తిరిగి ఉన్నత విద్య పూర్తి చేసి నేడు ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు కడెం మండలం లింగాపూర్‌కు చెందిన కుర్ర లింగవ్వ–బుచ్చన్న దంపతుల కుమారుడు కుర్ర శేఖర్‌. ఆర్థిక ఇబ్బందులతో ఇంటర్‌ ఆపిన శేఖర్‌ ముంబైలో కూలీగా పనిచేసి తిరిగి చదువు పూర్తి చేశారు. స్కాలర్‌షిప్‌లతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ (హిస్టరీ), ఐఏఎస్‌ఈలో ఎంఈడీ సాధించారు. 2009లో కౌటాల జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయుడిగా ప్రారంభించి, వివిధ పాఠశాలల్లో పనిచేసి 2023 అక్టోబర్‌ నుంచి మస్కాపూర్‌ పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌లో సోషల్‌ స్టడీస్‌ స్కూల్‌ అసిస్టెంట్‌గా సేవలందిస్తున్నారు.

ప్రత్యక్ష అనుభవంతో బోధన

సాంఘికశాస్త్రాన్ని ప్రాజెక్టులు, నమూనా ఎన్నికలు, మోడల్‌ కోర్టు, మోడల్‌ బ్యాంక్‌, నేలపై పటా లు గీయడం ద్వారా ఆచరణాత్మకంగా బోధిస్తున్నారు. ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌తో సాంకేతికత వినియోగించి, ఏటా సోషల్‌ స్టడీస్‌ ప్రాజెక్ట్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నారు. స్లిప్‌, గ్రాండ్‌ టెస్టులు, ప్రత్యేక తరగతులు, వాట్సాప్‌ పర్యవేక్షణ, ఇళ్ల సందర్శనలతో పదో తరగతి విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. సాంఘిక శాస్త్రంలో ప్రతి ఏడాది 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు.

విద్యార్థుల విజయాలు, అవార్డులు

ఆయన మార్గదర్శకత్వంలో అనేకమంది విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటారు. 2018, 2025లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు, 2020లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ నుంచి విద్యాసేవా రత్న బిరుదు అందుకున్నారు. సాంఘిక శాస్త్రం కేవలం మార్కుల కోసం కాదుం సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి ఆయుధమని శేఖర్‌ నమ్మకం. ఎనిమిదో తరగతి నుంచే నైతిక విలువలు, ప్రజాస్వామ్యం, పర్యావరణం, ఆర్థిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

ఖానాపూర్‌: మారుమూల గిరిజన గ్రామం కొలాంగూడం 152 కుటుంబాలు, అందరూ కొలాం గిరిజనులే. తెలుగు భాషపై అవగాహన తక్కువ, బడికి రావాలన్న ఆసక్తి కూడా అంతంత మాత్రం ఉన్న ఈ ప్రాంతంలో కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు తిరుమలేష్‌, అఖిల్‌ వినూత్న బోధనా పద్ధతులతో విద్యార్థుల్లో గణనీయమైన మార్పు తీసుకొస్తున్నారు. వారి మాతృభాష కొలామిలో తెలుగు లిపి ద్వారా కథల పుస్తకాలు రూపొందించి, స్వయంగా టీఎల్‌ఎం తయారు చేసి, డిజిటల్‌ పాఠాలు, గోడ చిత్రాల ద్వారా పిల్లల్లో చదువుపై ఆసక్తిని పెంచుతున్నారు.

ఇంటింటికీ వెళ్లి విద్యపై అవగాహన

బడికి సక్రమంగా రాని విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో పనులకు వెళ్తున్న పిల్లలను, బాల కార్మికులుగా మారే అవకాశం ఉన్న వారిని గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పిస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు తిరుమలేష్‌ సొంత ఖర్చులతో జనన ధ్రువీకరణ పత్రాలు అందించి, ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ చేసుకునేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో 2024లో 29 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 39కి చేరింది. గతంలో సగటు హాజరు 15–18 మంది మాత్రమే ఉండగా, ఇప్పుడు 25–32 మంది వరకు హాజరవుతున్నారు. గతంలో పాఠశాలంటే భయంతో ఉండే పిల్లల్లో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. మూడో, నాలుగో తరగతి వరకు పెన్ను, బలపం సరిగ్గా పట్టుకోలేని కొందరు విద్యార్థులు ప్రస్తుతం వర్క్‌బుక్స్‌ రాసే స్థాయికి చేరుకున్నారు. కళలు, విద్యా కార్యక్రమాల ద్వారా సృజనాత్మకతను వెలికితీస్తూ విలువల విద్య, జీవన నైపుణ్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.

సొంత ఖర్చులతో కిచెన్‌ షెడ్డు,

ప్రహరీ నిర్మాణం

వంటగది లేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఉపాధ్యాయులు సొంత ఖర్చులతో కిచెన్‌ షెడ్డు నిర్మించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలో కిచెన్‌ గది నిర్మాణం జరుగుతోంది. పాఠశాలకు ప్రహరీ నిర్మాణం కూడా పూర్తయింది. విద్యార్థులు, తల్లిదండ్రులతో అనుబంధం పెంచుకునేందుకు ఉపాధ్యాయులు గుస్సాడీ, భీమన్న తదితర గిరిజన పండుగల్లో భాగస్వాములు అవుతున్నారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తుల మధ్య అనుబంధం మరింత బలపడుతోంది. ‘ప్రత్యేక బోధనా విధానాల వల్ల ప్రవేశాలు, హాజరు పెరిగాయి. పిల్లల్లో బడి పట్ల ఆసక్తి, క్రమశిక్షణ పెరిగింది. విద్యతో పాటు సంస్కారం, విలువలు, జీవన నైపుణ్యాలను అలవర్చేందుకు కృషి చేస్తున్నాం’ అని ప్రధానోపాధ్యాయుడు తిరుమలేష్‌ తెలిపారు.

గిరిజన గ్రామంలో

విద్యా విప్లవం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement