టీహబ్‌.. ఓవర్‌ లోడ్‌ | - | Sakshi
Sakshi News home page

టీహబ్‌.. ఓవర్‌ లోడ్‌

Sep 4 2026 1:54 AM | Updated on Sep 4 2026 1:54 AM

● తరచూ మొరాయిస్తున్న యంత్రాలు ● మూడు రోజులుగా నిలిచిన రక్త పరీక్షలు ● కాలం తీరిన యంత్రాలే కారణమంటున్న సిబ్బంది

క్ష్మణచాంద మండలం ధర్మారం గ్రామానికి చెందిన రఫీ తన భార్యను ప్రసవం కోసం నిర్మల్‌ జిల్లా ప్రసూతి ఆసుపత్రికి గురువారం తీసుకొచ్చారు. బాధితురాలిని పరీక్షించిన వైద్యులు రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్యుల సలహా మేరకు ఆయన ఆస్పత్రిలోని ల్యాబ్‌కు వెళ్లగా, అక్కడ టీ–హబ్‌ యంత్రాలు పనిచేయడం లేదని, ల్యాబ్‌ సిబ్బంది పరీక్షలు నిర్వహించడానికి నిరాకరించారు. ఇక్కడ కుదరదని, జిల్లా జనరల్‌ ఆస్పత్రికి వెళ్లాలని చెప్పారు. చేసేదేమీ లేక రఫీ తన భార్యను తీసుకెళ్లి జిల్లా జనరల్‌ ఆస్పపత్రిలోని ల్యాబ్‌ను సంప్రదించారు. అయితే అక్కడ కూడా సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. టీ–హబ్‌ మిషన్లు మొరాయించాయని, ప్రస్తుతం పరీక్షలు చేయడం సాధ్యం కాదని చెప్పారు. దీంతో రఫీ భార్యను తీసుకుని ప్రైవేటు ల్యాబ్‌కు వెళ్లాడు.

నిర్మల్‌చైన్‌గేట్‌: నిర్మల్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నొస్టిక్‌ హబ్‌(టీహబ్‌) తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. యంత్రాలు తరచూ మొరాయించడంతో పరీక్షలకు అంతరాయం కలుగుతోంది. పేదలకు ఉచితంగా 57 రకాల వైద్య పరీక్షలు చేసేందుకు గత ప్రభుత్వం డయాగ్నొస్టిక్‌ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. కొంతకాలం సక్రమంగా పనిచేసినా, ఇటీవల తరచూ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే రసాయనాల కొరతతో టెస్టులు నిలిచిపోతుండగా, ఇప్పుడు యంత్రాల మొరాయింపుతో ఇబ్బందులు మరింత పెరిగాయి.

134 పరీక్షలు..

గతంలో టీ–హబ్‌లో క్లినికల్‌ పాథాలజీ, మైక్రోబయాలజీ, క్లినికల్‌ బయోకెమిస్ట్రీకి చెందిన 57 రకాల పరీక్షలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ సంఖ్యను 134కు పెంచారు. వీటిలో బయోకెమిస్ట్రీకి చెందిన 64 టెస్టులు, పాథాలజీకి చెందిన 28, మైక్రోబయాలజీ పరీక్షలు 42 ఉన్నాయి. అయితే యంత్రాలు మొరాయిస్తుండడంతో ఈ పరీక్షలకు అంతరాయం ఏర్పడుతోంది. పేదలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు.

రోగుల ఇబ్బంది..

ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులను వైద్యులు చూసి అవసరమైన రక్త పరీక్షలు చేయించుకోవాలని చె బు తున్నారు. అయితే యంత్రాలు పనిచేయడం లే దని, పరీక్షలు చేయలేమని సిబ్బంది చెబుతున్నారు. మందులు తీసుకోవాలని ఉచిత సలహా మాత్రమే ఇస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీ–హబ్‌లో యంత్రాలు పనిచేయక మూడు రోజు లుగా రక్త పరీక్షలు చేయడం లేదు. రోగులకు మందులు ఇచ్చి పంపిస్తున్నారు. దీంతో చాలా మంది రోగులు ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్తున్నారు.

ప్రత్యేక ల్యాబ్‌ అవసరం

జీజీహెచ్‌లో ప్రస్తుతం 1,100 మంది వరకు ఓపీ సే వలు పొందుతున్నారు. వీరిలో కచ్చితంగా 50 శా తానికి పైగా రోగులకు రక్త పరీక్షలు చేస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 80 మందికి పైగా రోగులు వి విధ అనారోగ్య కారణాలతో అడ్మిట్‌ అవుతున్నారు. జీజీహెచ్‌లో రోగుల తాకిడి అధికంగా ఉండడంతో రక్త పరీక్షల సంఖ్య కూడా పెరుగుతోంది. రక్త పరీక్షలు చేసే యంత్రంపై అధిక లోడ్‌ పడుతుండడంతో తరచూ మొరాయిస్తోంది.

జీజీహెచ్‌లో ల్యాబ్‌ లేక

గతంలో జీజీహెచ్‌కు ప్రత్యేక ల్యాబ్‌ ఉండేది. అప్పుడు వెంటవెంటనే రక్త పరీక్షల రిపోర్టులు వచ్చేవి. టీ–హబ్‌ ఏర్పాటుతో జీజీహెచ్‌ పూర్తిగా టీ–హబ్‌పైనే ఆధారపడి ఉంది. రక్త పరీక్షల రిపోర్టు రాకుండా జీజీహెచ్‌కు వచ్చే రోగులకు వైద్యులు మందులు ఎలా రాస్తారో, అడ్మిట్‌ అయిన రోగుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించినా దారుణంగా ఉంటుంది. పేదలు వచ్చే జీజీహెచ్‌కు ప్రత్యేక ల్యాబ్‌ ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement